తాగితే మర్చిపోగలను... కానీ తాగనివ్వరు... మర్చిపోతే తాగగలను... కానీ మర్చిపోలేను... అన్నాడో సినీ కవి. ఆనాడు ఆ సినీ కవి ఏ అర్థంలో ఈ మాటలన్నాడో తెలియదు కానీ తాగుబోతులు ఆస్వాదించే ఆనందం నిజంగా నిజమేనని సస్సెక్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తాజాగా తేల్చారు.
తాగితే నేను ఆనందంగా ఉండగలను... అంటూ తాగుబోతులు చెప్పే విషయం అక్షర సత్యమంటూ వీరు బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అసలింతకీ వీరు చెప్పేదేంటంటే... మనిషి తాగినపుడు వారి మెదడులో విషాధ సంఘటనలకంటే ఆనందకర క్షణాలే ఎక్కువగా జ్ఞప్తికి వస్తాయట. అందువల్లే తాగినపుడు మనిషి ఓ ఆనందకర లోకంలో ఉన్నట్టు ఫీలవుతుంటాడని వీరు తమ పరిశోధనలో కనుగొన్నారు.
తాగినపుడు చేదు సంఘటనల కంటే ఆనందకర విషయాలే ఎక్కువగా గుర్తుకురావడంలో మద్యం కీలకపాత్ర పోషిస్తుందట. అయితే మద్యం మోతాదు హద్దు దాటనంతవరకు మాత్రమే తాము చెప్పిన విషయాలు వర్తిస్తాయని, మద్యం మోతాదు హద్దు దాటితే ఆనందం మాట అటుంచి ఆపై ఏం జరుగుతుందో మందుబాబులకు అస్సలు గుర్తుండదని వీరు ముక్తాయిస్తున్నారు.
పై విషయాన్ని చదివి ఆహా... ఎంత గొప్ప విషయం అంటూ మందు తాగడానికి సిద్ధం కాకండి. ఎందుకంటే మందు తాగినపుడు ఆనందకర క్షణాలు గుర్తుకు వచ్చినా ఆ మత్తు కాస్తా దిగాక మీకు మిగిలేది కష్టాలే సుమా... అందుకే ఈ విషయాన్ని చదవడంతోనే సరిపెట్టండి.
|