ప్రముఖ యోగా గురువు బాబా రామ్‌దేవ్ ఆధ్వర్యంలో, కేంద్ర పారా మిలటరీ బలగాల కోసం శుక్రవారం నుండి యోగా క్యాంప్ జరుగనుంది. పదిరోజుల పాటు జరగబోయే ఈ యోగా క్యాంప్‌ను కేంద్ర హోంశాఖ నిర్వహిస్తోంది. నిత్యం రక్షణా బాధ్యతల్లో తలమునకలవుతోన్న జవానుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించే ఉద్దేశ్యంతో ఈ క్యాంప్‌ను తలపెట్టినట్లు హోంశాఖ వెల్లడించింది.కేంద్ర పారా మిలటరీ బలగాల్లో పనిచేసే మూడు నుంచి నాలుగువేల మంది సైనికులు ఈ యోగా క్యాంప్‌లో పాల్గొని, శిక్షణ పొందనున్నారు. యోగాలో శిక్షణ పొందిన సైనికులు వారి కర్తవ్య నిర్వహణలో భాగంగా, మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ తగినంత మానసిక స్థైర్యాన్ని పెంపొందిస్తూ... ఒత్తిడిని తగ్గించేలా "యోగా" ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు.ఇదిలా ఉంటే... యోగా క్యాంప్ లాగానే... అరవై వేలకు పైబడిన కేంద్ర పారా మిలటరీ బలగాలకు "ఆర్ట్ ఆఫ్ లివింగ్" కోర్సులను కూడా నేర్పించనున్నట్లు హోంశాఖ తెలిపింది. ఈ కోర్సులను "వ్యక్తి వికాస్ కేంద్ర" ఆధ్వర్యంలో నడుపనున్నట్లు హోంశాఖ అధికారులు తెలియజేశారు. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |