దేశ వైద్య రంగానికే తలమానికంగా ఉన్న బిల్‌రోత్ హాస్పిటల్ వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. అధిక రక్త ప్రసరణ ద్వారా చెడిపోయిన ఎడమ వైపు ఊపిరితిత్తిని తొలగించి రోగి ఆరోగ్యాన్ని కాపాడిన ఘనతను దక్కించుకున్నారు. ఇలాంటి అరుదైన ఆపరేషన్ చేయడం వైద్య చరిత్రలోనే ఇదే ప్రథమమని బిల్‌రోత్ ఆస్పత్రి వైద్యులు డాక్టర్ జయరామన్, డాక్టర్ మహాదేవన్, డాక్టర్ నెడుమారన్ తదితరులు వెల్లడించారు.
తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా హోసూరుకు చెందిన జయప్రకాష్ అనే వ్యక్తికి గుండె పొరలకు రక్తం ప్రసారం చేసే ధమనులు అదనంగా ఉన్నాయి. గుండె పొరలకు రక్తాన్ని ప్రసారం చేయాల్సిన ఈ ధమనులు ఎడమ ఊపిరితిత్తికి రక్తాన్ని ప్రసారం చేయడం వల్ల రోగి కనుగొనలేని వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. దీనివల్లల దగ్గు వచ్చినపుడు నోటిద్వారా రక్తం రావడం వచ్చేది. ఈ అంతుచిక్కని వ్యాధితో కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ వచ్చిన జయప్రకాష్.. ఆ తర్వాత బిల్‌రోత్ ఆస్పత్రిలో చేరారు.
బిల్‌రోత్ ఆస్పత్రి వైద్యులు దీన్ని గుర్తించి.. ఆపరేషన్ ద్వారా రక్తాన్ని సరఫరా చేసే అదనపు ధమనులను తొలగించారు. అంతేకాకుండా, రక్త ప్రసరణ ద్వారా చెడిపోయిన ఊపిరితిత్తి సగభాగాన్ని కూడా తొలగించారు. అతి క్లిష్టమైన ఈ శస్త్ర చికిత్సను ఈ వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు.