భారతదేశంలో వచ్చే 2025 సంవత్సరం నాటికి చక్కెర వ్యాధి (డయాబెటిక్) రోగుల సంఖ్య 57 మిలియన్లకు పెరగవచ్చని ఎంవీ డయాబెటిక్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ విజయ్ విశ్వనాథన్ అభిప్రాయపడ్డారు. డయాబెటిక్ రోగుల సంఖ్య అధికంగా కలిగిన దేశంగా భారత్ ప్రపంచంలో అగ్రస్థానాన్ని ఆక్రమించనుందని చెప్పారు. ఒక వ్యక్తి తనకు జీవిత కాలంలో సంక్రమించే వ్యాధులకు వెచ్చించే ఖర్చు కంటే డయాబెటిక్ వ్యాధి కోసం మూడింతలు ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు ఉన్నట్టు చెప్పారు.
చక్కెర వ్యాధి, ప్రభావం, వీటి నివారణపై సామాజిక ఆర్థిక ప్రభావం (సోషియో ఎకానమిక్ ఇంపాక్ట్ ఆఫ్ డయాబెటీస్ అండ్ ఇంట్స్ కాంప్లికేషన్స్) అనే అంశంపై చెన్నయ్‌లోని రష్యన్ కల్చరల్ సెంటర్‌లో శనివారం సదస్సు జరిగింది. ఈ సదస్సును చెన్నయ్‌లోని అమెరికా కాన్సులేట్ జనరల్ ఆండ్రూ టి సిమ్‌కిన్ ప్రారంభించగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ జోజ్కా రోగ్లిక్ ప్రారంభోన్యాసం ఇచ్చారు.
ఎంవీ హాస్పిటల్ ఫర్ డయాబెటీస్ ఎండీ డాక్టర్ విజయ్ విశ్వనాథన్ కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో చక్కెర వ్యాధి రోగుల సంఖ్య నానాటికీ పెరుగుతోందన్నారు. ఈ వ్యాధి పట్ల సరైన అవగాహన లేకపోవడం కూడా ఇది వ్యాప్తికి ప్రధాన కారణంగా ఉందన్నారు. సమాజంలో అనేక మందిలో అతి కొద్ది మంది మాత్రమే తమ వైద్య ఖర్చుల కోసం బీమా సౌకర్యాన్ని కల్పించుకుంటున్నారన్నారు.
చక్కెర వ్యాధి తీవ్రరూపం దాల్చితే దానివల్ల కలిగే నష్టం అపారంగా ఉంటుందన్నారు. ఈ వ్యాధి బారిన వారు ఎక్కువ కాలం మనుగడ సాగించేందుకు తప్పకుండా డయాలసిస్ చేయాల్సిన రావడంతో అప్పులపాలవుతున్నారని చెప్పారు. అంతేకాకుండా, తాము పొదుపు చేసుకున్న మొత్తాన్ని సైతం వైద్యానికి ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోందన్నారు.
డయాబెటిస్ వ్యాధి బారిన పడిన వారికి ఆర్థిక సాయం, బీమా సౌకర్యం కల్పించే అంశాలను చర్చించేందుకు దేశంలో తొలిసారి ఏర్పాటు చేసిన సదస్సు ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఈ సదస్సులో ప్రభుత్వ, ప్రైవేట్ బీమా సంస్థల ప్రతినిధులతో పాటు, పలు విద్యా సంస్థలకు చెందిన ఎకనామిక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు, వైద్యులు, వైద్యరంగానికి చెందిన ప్రముఖులు, నిపుణలు తదితరులు పాల్గొన్నారు.