క్రమం తప్పకుండా శరీర వ్యాయామాలు చేయడం వల్ల మధుమేహం వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చని డయాబెటాలజిస్టులు చెపుతున్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని చెన్నయ్‌లోని మాధవ్ డయాబెటిస్ సెంటర్ "హెల్త్ అండ్ హ్యాపినెస్" అనే కార్యక్రమాన్ని శనివారం నిర్వహించింది. ఇదే వేదికపై బాలల దినోత్సవ సందర్భంగా ప్రత్యేక వేడుకలను కూడా నిర్వహించింది.
చెన్నై నగరంలోని అన్నానగర్ రౌండ్‌టానా సమీపంలో గల మాధవ్ డయాబెటిస్ కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొన్న వక్తలు మధుమేహ వ్యాధిపై అవగాహన కలిగే రీతిలో ప్రసంగించారు.
మధుమేహ వ్యాధికి సంబంధించి పిల్లల్లో చైతన్యం కలిగించే రీతిలో మాధవ్ డయాబెటిస్ పలు పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించింది. ఆర్.ఎం. డయాబెటిస్ ఎడ్యుకేషన్ మరియు రీసెర్చ్ సంస్థ సహాయంతో శరీర వ్యాయామం, ఆహారం తీసుకునే విధానం వంటి పలు అంశాలను ఆధారంగా చేసుకుని మధుమేహ వ్యాధిని నిరోధించడంపై మాధవ్ డయాబెటిస్ కేంద్రం అవగాహన కార్యక్రమాలను నిర్వహించింది.
పిన్నలైనా, పెద్దలైనా శరీరానికి తగిన వ్యాయామాలు, ఆహారం తగిన మోతాదులో తీసుకుంటే.. చక్కెర వ్యాధిని నిరోధించవచ్చునని మాధవ్ డయాబిటిస్ సంస్థకు చెందిన వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. దీని ద్వారా గర్భధారణ సమయంలో వచ్చే డయాబెటిస్, చిన్నారుల్లో వచ్చే టైప్-2 డయాబెటిస్, పెద్దలకు వచ్చే టైప్-2 డయాబెటిస్‌లను నిరోధించడానికి వీలుంటుందని వారు చెబుతున్నారు.
ఇంకా చక్కెర వ్యాధిని నిరోధించే అంశాలను వాటి ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా 5 నుంచి 10 శాతం వరకు డయాబెటిస్, మెటాబలిక్ డిసార్డర్‌లను నివారించేందుకు వీలుంటుందని మాధవ్ సంస్థ భావిస్తోంది.