ప్రధాన పేజి   ఇతరాలు  ఆరోగ్యం  ఇతరాలు
 
రచుగా గొంతు నొప్పికి ఇన్‌ఫెక్షన్‌ కారణం
చాలా తరచుగా కొంతమందికి గొంతు నొప్పి వస్తూంటుంది. వీరిలో చాలామందికి క్రానిక్‌గా గొంతు ఇన్‌ఫెక్షన్‌ కి (బాక్టీరియా ప్రభావానికి) గురవుతూంటుంది. ముక్కులో క్రానిక్‌గా గొంతు ఇన్‌ఫెక్షన్‌ వున్నా, సైనసైటిస్‌ వ్యాధి దీర్ఘకాలంగా కొనసాగుతూ వున్నా గొంతు నొప్పి వుంటుంది. మరి కొంతమందిలో దీర్ఘకాలంగా టాన్సిల్స్‌ ఇన్‌ పెక్షన్‌ వుంటుంది. ఇంకొందరిలో దంత వ్యాధులు వదలకుండా వుంటాయి. ఈ అన్ని పరిస్థితుల్లో కూడా తరచు గొంతు నొప్పి చేస్తుంది. అందుకని తరచు గొంతు నొప్పి చేసేవాళ్లు ఈ కారణాలను దృష్టి లో వుంచుకోవాలి.

గొంతు నొప్పి వేస్తూందని యాంటి బయాటిక్‌ మందులు వాడుతూ తాత్కాలికంగా ఉపశమనం పొందినా మూలకారణం నివారణ జరగక రిపీటెడ్‌గా గొంతు నొప్పి చేస్తూనే వుంటుంది. ఇక పోతే పొగ రాయుళ్లకు, మద్యం సేవించే వాళ్లకు తరచు గొంతు నొప్పి అనిపిస్తూంటుంది. దుమ్ము ధూళి అధికంగా ఉండే చోట నివసించేవారికి, ఘాటైన రసాయనిక పదార్ధాలు తయారు చేసేవారికి, ప్యాక్టరీ పొగ విడుదలయ్యే చోట నివసించే వారికి తరచు గొంతు నొప్పి బాధ కనపడుతుంది.

వీరిలో వ్యాధి క్రిములు లేక పోయినా పొగ, దుమ్ము, రసాయనాల ఘాటు వంటివి ఇన్‌ఫెక్షన్‌ను కలగ జేసి గొంతు నొప్పిని కలిగిస్తాయి. ఎక్కువగా ఉపన్యాసాలు ఇచ్చేవారికి, గంటల తరబడి మాట్లాడే వారికి గొంతు నొప్పి కలగడం సహజం. అందుకనే రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, గాయకులు, సేల్స్‌మన్‌లకు తరచూ గొంతు నొిప్పి సమస్య వస్తూ వుంటుంది.

గొంతు నొప్పికి నివారణ మార్గాలు

ఇలా తర చుగా కలిగే గొంతు నొప్పిని క్రానిక్‌ ఫెరంజైటిస్‌ అంటారు. క్రానిక్‌ ఫెరంజైటిస్‌ ఇన్‌ఫెక్షన్‌ కారణమా లేక మరేదైనా కారణమై అని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే దీనికి చికిత్స చేయాల్సి వుంటుంది. ఇన్‌ఫెక్షన్‌ అయినటై్లతే యాంటి బయోటిక్‌ మందులను కనీసం పది రోజులు వాడాలి. మూల కారణానికి పూర్తి చికిత్స జరగాలి. అవసరాన్ని బట్టి నేసల్‌ స్వాబ్‌, థ్రోట్‌ స్వాబ్‌ తీసి కల్చర్‌ టెస్టు చేసి దాని ప్రకారం మందులు వాడాల్సివుంటుంది. దుమ్ము ధూళి కారణమైతే వాటికి దూరంగా వుండాలి.

వృత్తిరీత్యా, ప్రవృత్తి రీత్యా అధికంగా మాట్లాడేవాళ్లు, గొంతుకి కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ఇలా తరచూ వచ్చే గొంతు నొప్పి గురించి శ్రద్ద చూపాలి. గొంతు నొప్పికి కారణమైన బాక్టీరియా యాంటీ బయోటిక్స్‌ మాత్రలకు చాలా త్వరగా ప్రతిస్పందిస్తుంది. యాంటీ బయోటిక్స్‌ చికిత్స ఒకరినుంచి మరొకరికి ఇన్ఫెక్షన్‌ను వ్యాపించకుండా అరికడుతుంది. సకాలంలో గొంతు నొప్పికి చికిత్స చేయించుకోకున్నా, చికిత్సను నిర్లక్ష్యం చేసినా అది మరిన్ని ప్రమాదకర వ్యాధులకు దారితీయటమేకాకుండా ఒక్కోసారి గుండె కవాటాలు దెబ్బతినే ప్రమాదం కూడా వుంది.