" కలలు కనండి... ఆ కలలను సాఫల్యం చేసుకునేందుకు ప్రయత్నించండి" అని మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎప్పుడో సెలవిచ్చారు. ఆయన అన్నట్లే ఇటీవల చాలామంది పగటి కలల లోకంలో విహరిస్తున్నారట. ఉన్నఫలంగా తాము కోటీశ్వరులైపోవాలనీ, అత్యంత అందగత్తె అయిన అమ్మాయి/అబ్బాయిని వివాహమడాలనీ, కారు, బంగళా... ఇలా ఎన్నో 'పగటి' కలలు కంటున్నారట. ఇలా పగటి వేళల్లో స్వప్న లోకంలో విహరించేవారు సోమరులుగానూ...ఎందుకూ పనికిరాని దద్దమ్మలుగానూ ఉంటారని చాలామంది అభిప్రాయం. అయితే అది తప్పంటున్నారు పరిశోధకులు. పగటి కలల లోకంలో విహరించేవారు కలలో అనుకున్నది సాధించటానికి బాగా కృషి చేస్తారని చెపుతున్నారు. సహజంగా ఒక వ్యక్తి తనకు తీరని కోరికలు ఏమైనా ఉంటే వాటినే ఊహించుకుంటూ పగటి కలలలోకి జారుకుంటాడట. అయితే నేటి బిజీ జీవితంలో ఈ పగటి కలలు కనేందుకు అసలు సమయం ఉందా...? అనే సందేహం కలుగవచ్చు. ఉందంటున్నారు పరిశోధకులు. ఎంతటి వేగవంతమైన జీవితమైనప్పటికీ పగటి కలలకు అదేమీ అడ్డుకాదంటున్నారు.పగటి కలల లోకంలో విహరించడాన్ని కొంతమంది మానసిక రుగ్మతేమో అని కలత చెందుతుంటారు. అయితే ఇది సహజమైన పరిణామమేనంటున్నారు పరిశోధకులు. ఈ స్థితిలో సదరు వ్యక్తి తీరని తన కోరికలు, తీర్చుకోవాలనుకుంటున్న కోరికల గురించి పగటి కలలలో ఊహించుకుని సంతృప్తి చెందుతాడు. అయితే ఇవి హద్దు దాటితే అది మానసిక సమస్యగా రూపుదాల్చే ప్రమాదం లేకపోలేదు అంటున్నారు పరిశోధకులు. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |