" ఆనందం పంచేకొద్దీ పెరుగుతుంది... బాధను పంచేకొద్దీ భారం తగ్గుతుంది" అని పెద్దలు చెప్పిన మాటలు అక్షర సత్యాలని బ్రిటన్ పరిశోధకులు చెబుతున్నారు. అందమైన పరిసరాల నడుమ, ఆత్మీయుల అనురాగంతో తడిసి ముద్దయినపుడు మనసు ఎంత హాయిగా, ఆనందంగా ఉంటుందో అందరికీ తెలిసిందే...!అలాగే, ఏదేని ఓ విజయం సాధించినప్పుడు... స్నేహితులు, బంధువులు ఆనందిస్తుంటే ఆ ఉత్సాహం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఒంటరిగా ఉంటే, ఆ గెలుపులోని మజాను ఆస్వాదించలేము కదా..! అందుకు కారణం ఏంటంటే.... ఆనందం అనేది ఓఅంటువ్యాధి లాంటిది, అది ఆత్మీయులతో పంచుకునేకొద్దీ పైపైకి ఎగిసిపడుతుంటుంది. ఇదే విషయాన్ని బ్రిటన్ పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన నికోలస్ క్రిస్టకన్ నేతృత్వంలో పరిశోధనా బృందం ప్రామింగమ్ హార్ట్ స్టడీ ఆధారంగా పరిశోధనలను నిర్వహించింది. వీరి పరిశోధనల్లో భాగంగా... 21 ఏళ్ల నుండి 70 సంవత్సరాల వయస్సున్న సుమారు 5,124 మందిని 30 సంవత్సరాల పాటు పరిశీలించిన మీదట వారు పై విధంగా నిర్ణయానికి వచ్చారు.ఆనందం వ్యక్తిగతమైన అనుభూతి మాత్రమే కాదనీ, తమను అభిమానించే వ్యక్తుల ఆనందంపై కూడా అది ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. తమకు కలిగిన ఆనందాన్ని స్నేహితులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులతో పంచుకునేందుకే మనుషులు ఎక్కువగా ఇష్టపడతారనీ, వారంతా సంతోషంగా ఉన్నప్పుడే వీరు కూడా ఆనందంగా ఉండగలుగుతాడని, అంతేగాకుండా... ఒక వ్యక్తి మంచి ప్రవర్తన, సాయపడే గుణం లాంటివి కూడా ఇతరుల్లో మార్పు తీసుకొస్తుందని పై బృందం వెల్లడించింది. |