భార్యాభర్తల అనుబంధానికి ఇతర కారణాలు ఎన్ని ఉన్నా సెక్స్ కూడా ఓ ముఖ్యమైన అవసరం. ఓ సర్వే ప్రకారం సెక్స్ విషయంలో సంతృప్తిచెందిన భార్యాభర్తలు తమ బంధాన్ని కొనసాగించడంలో ఎదురయ్యే ఇతర ఇబ్బందులనుంచి తేలిగ్గా బయటపడగల్గుతారట. అంతేకాదు సెక్స్ విషయంలో కలిగిన సంతృప్తి ఇతర అంశాల్లో కలిగే చిన్న చిన్న అసంతృప్తులని దూరం చేస్తుందట. మరి ఇంతలా ఉపయోగం ఉన్న సెక్స్ విషయంలోనే కొందరు దంపతులకి అసలు సమస్య పుట్టుకొస్తుంటుంది. అలా పుట్టే ఆ సమస్య పెరిగి పెరిగి చివరకు వారి వివాహ బంధమే విచ్ఛిన్నమయ్యే స్థాయికి చేరుకుంటుంది. పెళ్లైన కొత్తల్లో సెక్స్ విషయంలో బాగా ఎంజాయ్ చేసినవారు సైతం వయసు పెరిగే కొద్దీ దాంపత్య సుఖానికి కొద్ది కొద్దిగా దూరమైపోతుంటారు. ఇలాంటివారిని కదిలిస్తే అందుకు ఎన్నో కారణాలు చెబుతారుగానీ తరచి చూస్తే మాత్రం ఒకే కారణం కన్పిస్తుంది. అదే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లోపించడం. పెళ్లైన కొత్తల్లో ఉన్న చొరవ, చిలిపితనం, ఆకర్షణ కొద్ది ఏళ్లు గడిచేసరికి తగ్గిపోవడం. దీంతో సదరు భార్యాభర్తల మధ్య ఏర్పడే శూన్యం కొద్ది కొద్దిగా పెరిగి చివరకు వేర్వేరు గదుల్లో నిద్రించేస్థాయికి చేరుకుంటుంది. అలాంటి సమయాల్లో ఏ చిన్న విషయంపైన ఘర్షణ తలెత్తినా అది చినికి చినికి గాలివానగా మారుతుంది. చివరకు దాంపత్య బంధాన్ని తెంచుకోవడానికి సైతం ఆ జంట సిద్ధమవుతుంది. ఇలాంటి జంటల విషయంలో సెక్స్ స్పెషలిస్టులు చెప్పే విషయం ఒకటే, వయసు మీదపడ్డా మనసును మాత్రం నిత్య యవ్వనంతో ఉంచుకోండని. ఎందుకంటే ఏ వ్యక్తైనా యవ్వనంలో ఉన్నంత చురుగ్గా, చలాకీగా, అందంగా వయసుమీదపడ్డా ఉండలేడు. అలాగే యవ్వనంలో ఉండే ఆకర్షణ సైతం వయసుమీద పడగానే దూరంకావడం ప్రారంభిస్తుంది. అలాంటపుడు నీలో అందం తగ్గిందని, ఆకర్షణ కరువైందని భర్త తన భార్యను నిందించడం... మీలో ఆనాటి వేగం ఎక్కడుంది, ఆ పర్సనాలిటీ ఎక్కడుందని భార్య తన భర్తను నిందించడం వృధా ప్రయాసే అవుతుందని సెక్స్ స్పెషలిస్టులు పేర్కొంటున్నారు. భార్యాభర్త సెక్స్ విషయంలో సంతృప్తి పడాలంటే కావాల్సింది అందం, ఆకర్షణ కాదని అర్థం చేసుకోవడమే ముఖ్యమని నిపుణుల అభిప్రాయం. వయసుమీద పడుతున్న కాలంలో ఈ అర్థం చేసుకోవడమనే అంశం మరింత ముఖ్యం అని వారు చెబుతున్నారు. వయసుతోపాటు స్త్రీలలో వచ్చే కొన్ని అనివార్య లక్షణాలను భర్త అర్థం చేసుకోవడం ఎంత ముఖ్యమో, బయటపనులతో సతమతమై ఇంటికి చేరే భర్త పరిస్థితిని భార్య అర్థం చేసుకోవడమూ అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. అలా అర్థం చేసుకుని ఒకరితో ఒకరు మాట్లాడడం, సమస్యల గురించి చర్చించుకోవడం చేస్తే వారి మధ్య అనురాగం పెరిగి పెద్దదవుతుంది. అలాంటి సమయంలో భార్యాభర్తలకు ఒకరికొకరు అందంగా ఆకర్షణీయంగా కన్పిస్తారు. ఆ తరుణంలో శారీరకంగా ఏకమయ్యే వారిద్దరికీ అందులో సుఖం తప్ప మరే లోపం కన్పించదని నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో వయసు పెరుగుతున్నా తమ సెక్స్ జీవితం నిస్సారంగా మారకూడదనుకునే దంపతులు కొన్ని జాగ్రత్తలు పాటించాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు. వీలున్నంతవరకు మద్యపానం, పొగతాగడంలాంటి వ్యసనాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించడం, క్రమం తప్పని తేలికపాటి వ్యాయామంలాంటివి చేయడం ద్వారా అటు ఆరోగ్యంతోపాటు సెక్స్ జీవితాన్ని కూడా నిరంతరం ఎంజాయ్ చేయవచ్చని నిపుణుల సలహా. కాబట్టి మీ సెక్స్ జీవితాన్ని సుఖమయం చేసుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉందన్న సంగతి మరిచిపోవద్దు సుమా. |