మారుతోన్న కాలానికి అనుగుణంగా మానవ సంబంధాలలో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఏ చిన్న మనస్పర్థలు వచ్చినా ఏకంగా సంబంధాన్నే తెంచేసుకునే స్థాయికి వెళుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ఒక ముఖ్యమైన ప్రశ్న ప్రస్తుతం భార్యాభర్తల మదిని వేటాడుతోంది. భర్త-భార్యకు, భార్య-భర్తకు తమ గత జీవితానికి, వర్తమానానికి సంబంధించిన అన్ని విషయాలను తెలియచేయడం ఎంతవరకు సబబు అనే ప్రశ్న. ఉదాహరణకు పెళ్లైన ఒక యువకుడు అంతకుముందే( అంటే పెళ్లికాక ముందు) ఒక స్త్రీతో చనువుగా ఉండటం లేదంటే పెళ్లైన ఒక మహిళ అంతకుముందే ( పెళ్లికాక మునుపు) మరొక యువకునితో చనువుగా ఉండటం. ఇటువంటివారు తొలిప్రేమ కాటుకు గురైన ప్రేమ జీవులు. కొన్ని అనుకోని పరిస్థితుల్లో ఇద్దరూ వేరైపోయి మరొకరితో పెళ్లి జరుగుతుంది. పెళ్లైనప్పటికీ ప్రియురాలు/ప్రియుడిని మరువలేక ప్రస్తుత భాగస్వామితో ఏ గొడవ వచ్చినా వెంటనే తమ మాజీ "లవ్" చరిత్రను కక్కేస్తారు. ఆవేశంలో తన ప్రియుడు/ ప్రియురాలు ఎంతో మంచిదని నేరుగా భాగస్వామి వద్దే చెప్పేస్తారు. అంతే... సంసారానికి బీటలువారి మోడువారుతుంది. ఏ మహిళైనా తన భర్త మరొకరితో ప్రణయకలాపాలు సాగించాడన్న చేదునిజం అంగీకరించలేదు. అలాగే ఏ పురుషుడైనా తన భార్య మరొకరితో సన్నిహితంగా గడిపిందంటే జీర్ణంచుకోలేడు. అందువల్ల గత ప్రణయ స్నేహం వున్నట్లయితే గతంగతః అని మరిచి గట్టిగా నోటికి తాళం వేసుకోవడం మంచిదని సలహాలిస్తున్నారు నిపుణులు. ఒకవేళ వీటన్నిటినీ దాటుకుని ఎవరో మూడో వ్యక్తి ద్వారా ఫలానా స్త్రీ, ఫలానా పురుషునితో బాగా "ఇది"గా ఉండేదని సమాచారం జనంలోకి వస్తే శిక్ష అనుభవించక తప్పదు. అప్పుడు తప్పకుండా భార్య/భర్త ముందు దోషిలా తలదించుకు నిలబడాల్సిందే. కనుక హద్దుమీరిన స్త్రీపురుష స్నేహాలు... భవిష్యత్ రాతల్నే మార్చేస్తాయన్న విషయాన్ని గుర్తెరిగి మసలుకోవాలంటున్నారు నిపుణులు. |