స్వైన్ ఫ్లూకు గల కారణాలపై ప్రస్తుతం అన్వేషణ సాగుతోంది. ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూను "2009-ఫ్లూ" లేదా హెచ్1ఎన్1గా పిలుస్తున్నారు. ఇటీవలే క్లినికల్‌గా గుర్తించిన ఈ కొత్త ఇన్‌ఫ్లుయన్జా వైరస్ స్ట్రెయిన్ ద్వారా వ్యాప్తి చెందుతున్నట్టు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాధి ఐదు పాయింట్ల స్థాయిలో ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఇదే సూచికే ప్రమాదానికి ప్రధాన సంకేతంగా చెప్పుకోవచ్చు.
అయితే, ఈ వ్యాధికి మూలమేమిటీ, ఏ సమయంలో సరిగ్గా వ్యాప్తి చెందుతుంది ఇత్యాది ప్రశ్నలకు సమాధానం ఇప్పటికీ అంతుచిక్కడం లేదు. ఈ వైరస్ లక్షణాలు మొదటిసారి మెక్సికో నగరంలో బయటపడ్డాయి. ఏప్రిల్ 24వ తేదీ తర్వాత అమెరికా ఆ తర్వాత ఇతర దేశాలకు వ్యాప్తి చెందింది. ఏప్రిల్ 28వ తేదీ నాటికి స్పెయిన్, బ్రిటన్, న్యూజిలాండ్, ఇజ్రాయేల్, తదితర దేశాల్లో 4400 కేసులు వెలుగు చూశాయి.
ప్రస్తుతం వీటి సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా 1,34,503గా ఉండగా, మన దేశంలో 864 మందికి ఈ వైరస్ సోకింది. అలాగే, స్వైన్ ఫ్లూ వైరస్‌కు మరణించిన వారి సంఖ్య 816గా ఉంది. (మన దేశంలో ఇప్పటి వరకు ఆరుగా నమోదైంది). అయితే, ఈ వైరస్ మెక్సికోలోని వ్యవసాయ క్షేత్రాల నుంచి వ్యాపించిందని కొందరు అంటుండగా, మరికొందరు చైనాలోని పందుల పెంపకానికి ఆయుపట్టుగా ఉండే ఫ్యూజియన్ ప్రాంతమే మూలమని అంటున్నారు. అయితే, ఈ వదంతులను ఆయా దేశాలు ఖండిచాయి. దీంతో వైరస్ పుట్టుకపై శాస్త్రవేత్తలు అన్వేషణ సాగిస్తున్నారు.