ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » స్వైన్ ఫ్లూ » స్వైన్ ఫ్లూతో మహారాష్ట్రలో మరో బాలిక మృతి (Swine flu | Another life | Shruti Gawade)
 
దేశంలో స్వైన్ ఫ్లూ మరో ప్రాణాన్ని బలిగొంది. తాజాగా ఓ 13 ఏళ్ల బాలిక స్వైన్ ఫ్లూ బారినపడి ప్రాణాలు కోల్పోయింది. ఆమె మరణంతో దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. పూణేలోని అహల్యాదేవి పాఠశాలలో చదువుతున్న శృతి గవాడే అనే బాలికకు స్వైన్ ఫ్లూ సోకింది. ఈ ప్రమాదకర వ్యాధి మంగళవారం వేకువజామున ఆమె ప్రాణాలు తీసింది.

మహారాష్ట్రలో స్వైన్ ఫ్లూ కారణంగా సంభవించిన ఆరో మరణం ఇది. ఇదిలా ఉంటే పూణేలో శృతితోపాటు మొత్తం ఐదుగురు స్వైన్ ఫ్లూతో ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని నారాయణ్ పేత్ ప్రాంతానికి చెందిన శృతి ఆగస్టు 7 నుంచి స్వైన్ ఫ్లూ చికిత్స పొందుతుంది. విషమ పరిస్థితుల్లో ఉన్న ఆమెను ససూన్ ఆస్పత్రిలో చేర్చారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించక ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఇదిలా ఉంటే చెన్నైలో సోమవారం ఇద్దరు వ్యక్తులు ప్రమాదకర స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఓ నాలుగేళ్ల బాలుడు ఉన్నాడు. మరోవైపు దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ వ్యాధి బారినపడిన వారి సంఖ్య వెయ్యికి చేరువతోంది. వ్యాధి తీవ్రరూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నియంత్రణ చర్యలను విస్తృతం చేసింది. వ్యాధి పరీక్షలు నిర్వహించేందుకు ప్రైవేట్ ల్యాబులకు అనుమతి ఇవ్వడంతోపాటు, చికిత్సను ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా విస్తరించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.