మీరు పనిచేసే కార్యాలయంలో ఏసీ లేదా కూలర్‌ను ఎక్కువ సేపు వినియోగిస్తుంటే కాస్త జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. స్వైన్ ఫ్లూకు చెందిన వైరస్ తక్కువ ఉష్ణోగ్రతంకల ప్రాంతంలో త్వరగా వ్యాపిస్తుందంటున్నారు ఆరోగ్యనిపుణులు.
చలికాలంలో ఈ వ్యాధి త్వరితంగా సంక్రమిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. ఈ నేపథ్యంలోనే పూనాలోని చాలా కార్యాలయాలలో ఏసీ, కూలర్‌ల వినియోగం ఎక్కువగా ఉండటం మూలాన అక్కడ త్వరగా ఈ వ్యాధికారక క్రిములు సంక్రమించాయని వైద్య నిపుణులు అన్నారు.
ప్రస్తుత ఏడాది మే నెలలో ఇన్ఫ్లూయెంజా హెచ్1ఎన్1 వైరస్‌పై సూక్ష్మ పరిశోధనలు జరిపినట్లు అమెరికన్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ తెలిపింది. హెచ్1ఎన్1 వైరస్ తక్కువ ఉష్ణోగ్రతలో వేగంగా వ్యాపిస్తాయని తమ పరిశోధనల్లో తేలినట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.
ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి ఈ వ్యాధికారక క్రిములు త్వరితంగా సంక్రమిస్తాయి. ముఖ్యంగా ఏసీ, కూలర్‌లను ఉపయోగించేవారు ఈ వ్యాధిబారినపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు వారు పేర్కొన్నారు. అదే 32 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో ఈ వ్యాధికారక క్రిములు నష్టపోతాయంటున్నారు పరిశోధకులు.
ఇది చల్లటి ప్రదేశాలలో వ్యాపించే వ్యాధి :
స్వైన్ ఫ్లూ వ్యాధికి సంబంధించిన వైరస్ మొట్టమొదటిసారి 1918లో వ్యాపించింది. వైరస్ ఏ ప్రాంతంనుంచి వ్యాపించిందనేది ఇప్పటికీ అనుమానంగానే ఉంది. కాని ముఖ్యంగా ఉత్తర అమెరికాలోని పిగ్ ఫార్మ్‌ల ద్వారా ఈ వ్యాధి ప్రపంచంలోని చల్లటి ప్రదేశాలకు వ్యాప్తి చెందింది.