ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఒత్తిడి అనే పదాన్ని వాడుతున్నారు. ఎందుకు ఒత్తిడి అంటే టెన్షన్ వల్ల ఒత్తిడి పెరుగుతోందని కొందరు చెబుతుంటారు. పని వల్ల ఒత్తిడి పెరుగుతోందని మరికొందరు చెబుతుంటారు. మరికొందరేమో బాధ్యతల వల్ల తమకు ఒత్తిడి పెరుగుతోందని కూడా చెబుతుంటారు.
అయితే కారణం ఎదైనా నేటి కాలంలో ప్రతి ఒక్కరు ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెప్పుకోవచ్చు. మరి మనం ఎదుర్కొంటున్న ఈ ఒత్తిడి వల్ల కలిగే నష్టాలేవైనా ఉన్నాయా అంటే చాలా రకాల కష్టాలకు, నష్టాలకు ఈ ఒత్తిడినే కారణంగా కలుగుతున్నాయి. ఎందుకంటే ఒత్తిడి అనేది మొదట మానసిక అనారోగ్యానికి దారితీసి భవిష్యత్‌లో శారీరక అనారోగ్యానికి సైతం దారితీసే అవకాశముంది.
వీటితోపాటు ఒత్తిడి వల్ల మరికొన్ని నష్టాలు కూడా మనిషి దరిచేరుతాయి. ఒత్తిడి కారణంగా శరీరం ఎక్కువ పరిమాణంలో విటమిన్లను కోరుకుంటుంది. దీంతో ఒత్తిడిలో ఉన్నవారు ఆహారాన్ని అధికంగా తీసుకోవడం మొదలు పెడుతారు. ఈ కారణంగా వారు బరువు పెరిగి స్థూలకాయులుగా తయరయ్యే ప్రమాదముంది.
అలాగే ఒత్తిడి కారణంగా కొన్నిసార్లు పూర్తిగా ఆహారం తీసుకోవడంలో నిర్లక్షం ప్రదర్శించడంతో బలహీనంగా తయారయ్యే అవకాశముంది. అలాగే ఒత్తిడి కారణంగా చికాకు, నిద్రలేమి తదితర సమస్యలు సైతం దరిచేరుతాయి. దీంతో సదరు వ్యక్తులు అందరితో కలిసి ఉండలేక కుటుంబం, సామాజిక జీవితంలో ఒంటరిగా మారే ప్రమాదముంది.
ఇన్ని సమస్యలకు కారణమైన ఒత్తిడిని దూరం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. చిన్న, చిన్న విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే ఒత్తిడిని దరిచేరనీయకుండా ఉల్లాసంగా ఉండవచ్చు.
ప్రతిరోజు క్రమం తప్పుకుండా కొంతసేపు వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకుంటే దేహంలోని ఒత్తిడిని చాలాభాగం బయటకు పంపినవారవుతాం. అలాగే ఉదయం సూర్యోదయం వేళ కొద్దిసేపు ఆ ఎండలో గడపగలిగితే మెదడు చురుగ్గా మారి ఆరోజు ఒత్తిడి దరిచేరదు.
ఆఫీసులో ఎంతపని ఉన్నా కూడా రోజులో కొంతసేపైనా కుటుంబసభ్యులతో గడపడం, వారాంతాల్లో బయట ప్రాంతాల్లోకి వెళ్లి ఉల్లాసంగా గడపడం లాంటివి చేయడం వల్ల మీ మెదడులో ఉల్లాసమే తప్ప ఒత్తిడికి చోటుండదు. పుస్తకాలు చదవడం, యోగా, ధ్యానం లాంటి చర్యలకు ఉపక్రమించడం ద్వారా కూడా ఒత్తిడిని జయించగలం.
ఆలాగే ప్రతిరోజూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవడం ద్వారా చక్కని ఆరోగ్యంతో పాటు ఒత్తిడిలేని ప్రశాంత జీవితాన్ని కూడా పొందగలం.
|