మంచుముక్కలు అంటే ఐస్ క్యూబ్‌లు. వీటిని తరచూ వేసవిలోనే ఎక్కువగా వాడుతుంటారు. కాని ఈ మంచు ముక్కల్లో ఔషధగుణాలున్నాయంటున్నారు వైద్యులు.
శరీరం కాలితే : శరీరం కాలితే వెంటనే ఐసు ముక్క కాలిన గాయంపై ఉంచి రుద్దితే మంటనుంచి ఉపశమనం కలగుతుంది. దీంతో గాయం త్వరగా మానుతుందంటున్నారు వైద్యులు.
ముక్కునుంచి రక్తం కారుతుంటే : ముక్కునుంచి రక్తం కారుతుంటే మంచు ముక్కను ఓ గుడ్డలో ఉంచి ముక్కుపై ఉంచండి. కాసేపట్లోనే ముక్కునుంచి రక్తం కారడం తగ్గి ఉపశమనం కలుగుతుంది.
దెబ్బలు తగిలితే : ప్రమాదవశాత్తు గాయాలపాలై శరీరంపై లోదెబ్బలు తగిలితే ఆ దెబ్బలపై మంచుముక్కలుంచి సుతిమెత్తగా రుద్దాలి. దీంతో దెబ్బ తగిలిన చోట రక్తం గడ్డకట్టే పరిస్థితి ఉత్పన్నం కాదు. నొప్పినుంచికూడా ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
శరీరంనుంచి రక్తం కారుతుంటే : శరీరంనుంచి ధారాపాతంగా రక్తం కారుతుంటే ఆ స్థానంలో మంచుముక్కలను ఓ గుడ్డలో వేసి కట్టేయండి. దీంతో రక్తం కారడం తగ్గిపోతుంది.
శరీరంలోని ఏదైనా భాగం బెణికితే : శరీరంలోని ఏదైనా భాగం బెణికితే ఆ ప్రాంతంలో వెంటనే మంచుముక్క ఉంచితే వాపు రాదంటున్నారు వైద్యులు.
గొంతులో కిచ్ కిచ్ : గొంతులో కిచ్ కిచ్ ఉంటే మంచుముక్క తీసుకుని గొంతుపై భాగంలో మెల్లగా రుద్దితే ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు.
కీళ్ళవాతంతో బాధపడుతుంటే : కీళ్ళవాతంతో బాధపడుతుంటే నొప్పి ఉన్న చోట మంచు ముక్కను అలాగే రెండు నిమిషాలపాటు ఉంచండి. ఆ తర్వాత తొలగించండి. రెండు నిమిషాల తర్వాత మళ్ళీ ఆ మంచుముక్కను ఉంచండి. ఇలా ఎనిమిది నుంచి పదిసార్లు చేయండి. దీంతో నొప్పి మటుమాయం అంటున్నారు వైద్యులు. |