రోజు రోజుకూ వయసు మీదపడుతున్న వారి మెదడు పనితీరు మందగించటం సర్వసాధారణమైన విషయమే. వయసు పెరుగుదలతో పాటు మతిమరపు, చాదస్తం లాంటివి కూడా పెరుగుతుంటాయి. సాధారణంగా వయసుతో పాటు మెదడులో సంభవించే ఈ మార్పులన్నింటినీ "ఏరోబిక్స్" దూరం చేయటమే కాదు, మెదడును పూర్తి ఆరోగ్యంగా ఉండేలా తయారు చేయగలవని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.క్రమశిక్షణాయుతమైన జీవనంతో పాటు "ఏరోబిక్స్" చేయడం వల్ల వయసు మీదపడిన వృద్ధుల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు, మెదడు పనితీరు కూడా మెరుగుపడుతుందని పై పరిశోధనల్లో తేలింది. అంతేగాకుండా, "అల్జీమర్స్" వ్యాధితో బాధపడుతున్న వారిలో కూడా ఈ ఏరోబిక్స్ మంచి ఫలితాలను చూపించగలవని పరిశోధకులు చెబుతున్నారు.ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన ఇల్లినాయిస్ యూనివర్శిటీ పరిశోధకుడు ఆర్ట్ క్రామెర్ మాట్లాడుతూ... వయసు ప్రభావం వల్ల మెదడు పనితీరు మందగించటాన్ని నియంత్రించే శక్తి ఏరోబిక్స్‌కు ఉందని వివరించారు. అంతేకాదు, ఆరునెలలపాటు క్రమం తప్పకుండా ఏరోబిక్స్ చేసి చూస్తే... మీ మెదడు పని తీరు ఎంతగా మెరుగైందో మీకే అర్థమవుతుందని ఆయన భరోసా కూడా ఇస్తున్నారు.ఒక వయసు వచ్చాక మెదడు ఎదుగుదల, అభివృద్ధి నిలిచిపోతుంటుంది. సహజంగా వయసు పెరుగుతున్న కొద్దీ ప్రతి పదేళ్లకు ఒకశాతం చొప్పున మెదడు పరిమాణం తగ్గుతూ వస్తుంది. రోజుకు గంటసేపు లేదా వారంలో కనీసం మూడు రోజులు ఏరోబిక్స్ చేసిన వారి మెదడు పరిమాణం, వారికంటే మూడేళ్లు తక్కువ వయస్సున్న వారి మెదడు పరిమాణానికి పెరిగినట్లు తమ పరిశోధనల్లో గుర్తించామని క్రామెర్ చెప్పారు. కాబట్టి, మెదడును ఉత్తేజితం చేసి, ఎదుగుదల నిలిచిపోకుండా చేసే "ఏరోబిక్స్" ఇకపై తప్పకుండా చేస్తారు కదూ...! |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |