తరుముకొస్తున్న ఆర్థిక సంక్షోభం... భవిష్యత్తు ఎలా గడుస్తుందోనన్న బెంగ... కుటుంబ బరువు, బాధ్యతలు... వెరసి జీవితం పూర్తిగా ఒత్తిడిమయం. ఫలితంగా అనేకానేక శారీరక ఇబ్బందులు.. ఉద్యోగస్తులలో...అందునా డెస్క్ జాబ్స్ చేసేవారిలో చాలామంది తరచుగా చెప్పే మాట... " నా వృత్తి రీత్యా గంటలతరబడి కుర్చీకి అతుక్కుపోయి పనిచేయాలి. ఇలా సుదీర్ఘంగా పనిచేసినప్పుడు వెన్ను నొప్పి బాధ పెడుతుంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు." అంటారు. విద్యార్థినీ విద్యార్థులైతే..." పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చదువు ధ్యాసలో పడి నిద్ర సరిగా పట్టడం లేదు. నిద్రకు ఉపక్రమించినా కలత నిద్రే. తెల్లారేసరికి పూర్తిగా అలసిపోతున్నా" మని చెపుతుంటారు. ఇక ఇంటెడు చాకిరీ చేసే గృహిణుల బాధలు వర్ణనాతీతం. ఇలా శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతూ జీవనాన్ని కొనసాగించేవారి సంఖ్య రోజురోజుకీ అధికమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటువంటి సమస్యలను తరిమివేయగల ఒకే ఒక్క సాధనం ధ్యానం అంటున్నారు నిపుణులు. యోగ సాధన వల్ల ఏకాగ్రత ఏర్పడుతుంది. చేసే పనిపై ఇష్టం, ఆసక్తి పెరుగుతాయి. శరీరం బరువు తగ్గి చురుకుదనం ఏర్పడుతుంది. శారీరక రుగ్మతలు.... ప్రధానంగా రక్తపోటు, మధుమేహం, కీళ్ల నొప్పులు వంటివి దరిచేరవు. వైద్య శాస్త్రాలకు కూడా అంతుచిక్కని కొన్ని సమస్యలకు యోగ, ధ్యానం పరిష్కారం చూపుతున్నాయి. ఏ పనిలో విజయం సాధించాలన్నా... మనసుపై మన ఆధిపత్యం అవసరం. దానిని అదుపులో పెట్టగల సామర్థ్యం ధ్యానానికి మాత్రమే ఉంది. కనుక రోజూ తీరిక చేసుకుని మరీ ధ్యానం చేద్దాం. జీవితాన్ని సుఖమయం చేసుకుందాం. |