భారత యోగాసనాలను కాపీ కొట్టి.. వాటికి పేటెంట్ పొందేందుకు కొంతమంది విదేశీ యోగా గురువులు చేస్తున్న ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.ఈ చర్యల్లో భాగంగా... కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన 200 మంది శాస్త్రవేత్తలు, హిందూ యోగా గురువులతో కూడిన ఓ బృందాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలోని పురాతన యోగాసనాలను గుర్తించి, వాటన్నింటినీ "భారత సంప్రదాయ విజ్ఞానం" పేరుతో డిజిటల్ లైబ్రరీలోకి ఎక్కించే బాధ్యతను ఈ బృందానికి అప్పగించింది.మహాభారతం, భగవద్గీత, పతంజలి యోగా సూత్రాలతో సహా 35 గ్రంథాల్లోంచి ఇప్పటిదాకా 600 ఆసనాలను భారత అధికారులు "భారత సంప్రదాయ విజ్ఞానం" డిజిటల్ లైబ్రరీలోకి చేర్చాలని "ది టెలిగ్రాఫ్" పత్రికా కథనం వెల్లడించింది. ఈ డిజిటల్ లైబ్రరీలోని సమాచారాన్ని ప్రపంచంలోని అన్ని పేటెంట్ కార్యాలయాలకు అందుబాటులో తెచ్చినట్లు ఆ పత్రిక తెలిపింది.ఇలా చేయడం వల్ల పేటెంట్ కోసం వచ్చే దరఖాస్తులు అసలైనవో లేక కాపీ కొట్టినవో వెంటనే తెలిసిపోతుందని టెలిగ్రాఫ్ కథనం పేర్కొంది. ఇదిలా ఉంటే... కేవలం అమెరికాలోనే ఇప్పటిదాకా.. 130 యోగా సంబంధిత పేటెంట్లు, 150 కాపీరైట్లు.. 2,300 ట్రేడ్ మార్కులు నమోదైనట్లు తెలుస్తోంది. |