పిల్లలూ దేవుడూ చల్లనివారే... కల్మషం లేని ఆ పసివారికోసం మన దేశంలో ప్రతి ఏటా నవంబర్ 14న బాలల దినోత్సవం నిర్వహించబడుతోంది. జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం కూడా అయిన ఈరోజున బాలల దినోత్సవాన్ని నిర్వహించటం.. బాలల పట్ల ఆయనకు గల ప్రత్యేకమైన ప్రేమాభిమానాలే కారణం. ఈ బాలల దినోత్సవం నాడు ప్రతి పాఠశాలలోనూ ప్రత్యేకంగా వేడుకలను నిర్వహిస్తారు.
అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అటువంటివారి పేరిట బాలల దినోత్సవం వేడుకను నిర్వహించటం వారిలో నూతనోత్తేజాన్ని కలిగిస్తుంది. బాలల దినోత్సవంతోపాటు బాలబాలికల శ్రేయస్సు, హక్కుల పరిరక్షణకోసం అంతర్జాతీయంగా ఎన్నో కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. ఇవన్నీ చిన్నారులకు చేరిననాడే బాలలకు నిజమైన పండుగ రోజు.
|