వాతావరణంలో అసమతుల్యత, వైరస్ సంబంధంగానూ, క్రోమోజోమ్‌ల నిర్మాణంలో లోపాల వల్ల పుట్టిన పిల్లల్లో గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గుండె జబ్బుల్ని పిల్లలు తల్లి గర్భంలో ఉన్నప్పుడే గుర్తించవచ్చు లేదా ప్రసవించిన సమయంలోనూ గుర్తించవచ్చు.గట్టి ఏడ్చినప్పుడు ముఖం నీలి రంగులోకి మారిపోవడం జరిగినట్లయితే.. ఆ చిన్నారికి గుండె జబ్బు ఉన్నట్లుగా గుర్తించవచ్చు. పిల్లలకు తరచుగా దగ్గు, జలుబు రావడం, పాలు తాగలేకపోవడం, ఆయాసపడుతుండటం, నుదుటిమీద చెమట పట్టడం, లివర్ పెరిగినట్లు అనిపించడం లాంటి లక్షణాలు కనిపించినట్లయితే.. వీటిని జన్మతహ గుండె జబ్బులుగా భావించవచ్చు. వీరిలో ఇక ఎదుగుదల ఉండదు.పుట్టిన తొలి వారంలోనే పిల్లల్లో గుండె జబ్బులకు సంబంధించిన లక్షణాలు కనిపించినట్లయితే ఎక్కువ ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తించాలి. ఆరు వారాల తరువాత వీటిని ఎవరైనా గుర్తించగలిగితే వాళ్ళు కొంతకాలం బ్రతుకుతారు. అయిదేళ్ల తరువాత ఈ వ్యాధి లక్షణాలు కనిపించినట్లయితే.. మధ్యలో ఇన్‌ఫెక్షన్ వల్ల వచ్చినదిగా భావించాలి.కొంతమంది చిన్నారులు నడుస్తూ, నడుస్తూ క్షణంలో కుప్పగూలుతుంటారు. ఈ రకమైన వ్యాధి లక్షణాలతో ఉన్నప్పుడు వారికి గుండెజబ్బు ఉన్నట్లుగా భావించాలి. నిర్ధారణ కోసం వారికి వెంటనే వైద్య పరీక్షలు నిర్వహించాలి.గుండె జబ్బులు ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాత ఊపిరితిత్తులకు తరచూ ఇన్‌ఫెక్షన్ రాకుండా చూసుకోవాలి. మంచి పోషకాహారం అందించాలి. ఇతర ఇన్‌ఫెక్షన్లు సోకకుండా టీకాలు వేయించాలి. గుండె పొరల్లో రంధ్రాలు ఏర్పడితే దాన్ని పుట్టిన వెంటనే ఎకో పరీక్షల ద్వారా గుర్తించినట్లయితే.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే.. గుండె కండరాల్లో ఏర్పడిన రంధ్రాలు పూడిపోవాలంటే, తప్పనిసరిగా ఆపరేషన్ చేయాల్సిందే..!అయితే, పిల్లల ఆరోగ్య సామర్థ్యాన్ని బట్టి ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే... గుండె రంధ్రాన్ని మూసివేసేలా చేసేందుకు వారి ఊపిరితిత్తుల సామర్థ్యం, బరువు, ఇతర ఇన్‌ఫెక్షన్స్ లాంటివి పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ బాగున్నట్లయితే వెంటనే సర్జరీ చేయాలి. కొన్ని గుండె జబ్బులకు మాత్రం మూడేళ్ల తరువాత సర్జరీ చేయాల్సి ఉంటుంది. సైనిటిక్ హార్ట్ డిసీజ్‌ను మాత్రం ఆరునెలల్లో సరిచేయవచ్చు. |