ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » తల్లి ఉద్యోగిని అయితే.. చిన్నారులకు శాపమే..!! (Kids World | Articles | House Wife | Working Women | TV | Child Health Institute | Catherine Law)
గృహిణుల పిల్లలతో పోల్చితే.. ఉద్యోగినుల పిల్లలు ఎక్కువ కాలం టీవీల ముందు గడపటమేగాక, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు లోనవుతారని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. దీంతో గృహిణుల పిల్లల కంటే ఉద్యోగిని పిల్లలు ఎక్కువగా జబ్బుల బారిన పడుతుంటారని ఈ అధ్యయనం హెచ్చరించింది.
"చైల్డ్ హెల్త్ ఇనిస్టిట్యూట్"కు చెందిన పరిశోధకులు దాదాపు 12,500 మంది చిన్నారుల కుటుంబ నేపథ్యాలను పరిశీలించిన మీదట పై నిర్ధారణకు వచ్చారు. ఉద్యోగస్తులైన తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో లేనట్లయితే, వారి పిల్లలు ఎక్కువగా టీవీ చూడటం, కూల్ డ్రింక్స్ లాంటివి లాగించటం వంటివి చేస్తుంటారు. ఇలాంటి పిల్లలు పండ్లు, కూరగాయలు తదితర ఆరోగ్యకర ఆహార అలవాట్లను పక్కకుపెట్టి ఫాస్ట్‌ఫుడ్ బారిన పడుతున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.
అయితే.. ఉద్యోగం చేసే తల్లులకంటే.. గృహిణులైన తల్లులు తమ పిల్లల శారీరక మానసిక ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారని ఈ అధ్యయనం తెలిపింది. గృహిణులు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన, పుష్టికరమైన ఆహారాన్ని ఇవ్వటమేగాక.. వారికి అవసరమైన ఎక్సర్‌సైజులను కూడా విధిగా చేయిస్తుంటారని, ఉద్యోగినుల విషయంలో ఇది సాధ్యంకాదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ కేథరిన్ లా మాట్లాడుతూ... పిల్లల వ్యాయామం, చిరుతిళ్ల విషయంలో గృహిణుల పిల్లలకు, ఉద్యోగినుల పిల్లలకు పెద్ద తేడా ఏమీ లేదని పేర్కొన్నారు. అయితే, ఆ కొద్దిపాటి తేడాలవల్ల కూడా పిల్లలు అనారోగ్యం బారిన పడే అవకాశాలను కల్పిస్తున్నాయన్నారు.
కాగా... ఉద్యోగినులు తమ పిల్లలపట్ల సరైన శ్రద్ధ తీసుకోవటం లేదని చెప్పటం తమ ఉద్దేశ్యం కాదని కేథరిన్ స్పష్టం చేశారు. కానీ ఉద్యోగినులు అన్నిరకాల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించేందుకు వారికి సమయం సహకరించని మాట వాస్తవమేనన్నారు. అయితే.. ఉన్న సమయాన్నే ఇటు కుటుంబానికి, అటు ఆఫీసుకు సర్దుకునేలా తగిన ప్రణాళికలను రూపొందించుకుని ముందుకెళ్లాలని చెప్పటమే తమ పరిశోధనల లక్ష్యమని కేథరిన్ వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. "ది జర్నల్ ఆఫ్ ఎపిడెమీయోలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్"లో పై అధ్యయనానికి సంబంధించిన వివరాలను ప్రచురించినట్లు "డైలీ మెయిల్" ఓ కథనాన్ని వెలువరించింది. సో.. ఉద్యోగినులూ..! ఈ అధ్యయనం ప్రకారం మీకున్న సమయాన్ని తగిన విధంగా ప్రణాళిక వేసుకుని చిన్నారుల కోసం కేటాయించక పోయినట్లయితే.. వారి శారీరక, మానసిక అనారోగ్యానికి మీరే కారకులవుతారన్న విషయం మర్చిపోరు కదూ...?!