ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » కథనాలు » రేపటి నుంచి "అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం" (Articles | Hyderabad | International Kids Film Festival | Saturday | November 14 | Nandita Das | Gita)
రెండు సంవత్సరాలకు ఒకసారి హైదరాబాద్ నగరంలో నిర్వహించే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. నవంబర్ 14వ నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు నిర్వహించే ఈ వేడుకల్లో 20 దేశాల నుంచి 70 చలన చిత్రాలను ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా బాలల చలన చిత్రోత్సవాల ఛైర్ పర్సన్, ప్రముఖ సినిమా నటి నందితాదాస్, సీఈఓ సుశోవన్ బెనర్జీ, ఆంధ్ర రాష్ట్ర సమాచారశాఖ మంత్రి గీతారెడ్డి, చలనచిత్ర అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సి. పార్థసారథి, యూనిసెఫ్ ప్రతినిధి కరేన్ హుల్షఫ్, జ్యూరీ మెంబర్ నగేష్ కకునూర్ తదితరులు మీడియా ప్రతినిధుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
14వ తేదీ సాయంత్రం ఆరున్నర గంటలకు కేంద్ర సమాచార శాఖామంత్రి అంబికాసోని చేతులమీదుగా.. పబ్లిక్ గార్డెన్స్‌లోని లలిత కళాతోరణంలో ఈ చలన చిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గోనున్న ఈ ఉత్సవాల్లో వివిధ దేశాల నుంచి 400 మంది బాల ప్రతినిధులతోపాటు మరో వందమంది ప్రతినిధులు పాలుపంచుకోనున్నారు.
కాగా. ఈ చిత్రోత్సవాల్లో సినిమాలు కేవలం ప్రదర్శనకే పరిమితం కాదనీ.. బాలల మనో వికాసానికీ, చైతన్యానికీ, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఉపయోగపడతాయని నందితాదాస్ అభిప్రాయపడ్డారు. మూడేళ్ల క్రితమే ఫిలిం సొసైటీ బాధ్యతలు చేపట్టాననీ.. ప్రతి సంవత్సరం ఉత్సవాలు మరింత మెరుగ్గా జరిగేలా తగు చర్యలు తీసుకుంటాననీ అన్నారు.
అదే విధంగా యూనిసెఫ్ ప్రతినిధి కరేనియా మాట్లాడుతూ.. చిన్నారుల్లో సాంస్కృతిక, మానసిక చైత్యనం కలిగించే ప్రయత్నంలో తాము కూడా భాగస్వాములవటం సంతోషంగా ఉందన్నారు. ప్రతిసారీ భారత్‌లో చిన్నారుల చిత్రాలు మరింతగా పెరుగుతూ ఉండాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే... ప్రసాద్ ఐమాక్స్‌లో నవంబర్ 19వ తేదీన చిన్నారుల కోసం ప్రత్యేకంగా "ఫ్లయ్ నీడ్ టు మూన్" అనే చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖామంత్రి గీతారెడ్డి చెప్పారు. అలాగే బాలలను చైతన్యపరిచేందుకు నవంబర్ 13వ తేదీన నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్ ఫ్లాజా నుంచి లుంబినీ పార్క్‌దాకా 2కె రన్‌ను కూడా నిర్వహించనున్నట్లు ఆమె వివరించారు.