* చిన్నప్పట్నుంచే పిల్లల్లో ట్రాఫిక్ నిబంధనలమీద అవగాహన పెంచాలి. ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు, జీబ్రాలైన్ల మీద మాత్రమే రోడ్డు దాటాలని వివరంగా చెప్పాలి. బండి సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు... ఆ గుర్తులేమిటో, ఎందుకు పడతాయో, వాటికి అర్థమేమిటో వివరించాలి. ఇంట్లో వీటిపై పెద్దలు క్విజ్‌లాంటివీ కూడా పెట్టవచ్చు. * రోడ్డు దాటేటప్పుడు పిల్లల చిటికెనవేలు పట్టుకుని దాటించాలి. అలవాటయ్యాక పిల్లల్ని తమ వెనకే దాటమని చెప్పాలి. ఆతర్వాత అటుపక్క నిలబడి, తడబడకుండా స్వతంత్రంగా దాటేలా ప్రోత్సహించాలి. స్కూలు నుంచో, ట్యూషను నుంచో ఒంటరిగా వస్తున్నప్పుడు అపరిచితులు లిఫ్ట్ ఇస్తామన్నా తిరస్కరించాలని చెప్పాలి. బంతుల కోసమో, స్నేహితుల్ని కలుసుకోడానికో రోడ్డుమీద పరుగులు తీయడం ఎంత ప్రమాదమో అర్థమయ్యేలా వివరించాలి.* కుర్రాళ్లు వాహనాల్ని ఉరికెత్తించాలని ఉబలాటపడతారు. అందరికంటే ముందుండాలని తహతహలాడతారు. సర్కస్ ఫీట్లు చేస్తారు. ఆ ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లూ వికలాంగులైనవాళ్లూ చాలామంది ఉన్నారు. పిల్లలకి అలాంటి సంఘటనలు గుర్తుచేస్తుండాలి. హెల్మెట్ వాడకపోతే కోప్పడాలి. "మీ లక్ష్యం ఐఐటీ కావచ్చు, ఐఏఎస్ కావచ్చు. ఏదైనా బతికుంటేనే సాధ్యం" అని వారికి స్పష్టం చేయాలి. |