* కొంతమంది పిల్లలకి తగని మొహమాటం. ఇలాంటి వారు నలుగుర్లోనూ అసలు కలవలేరు, చొరవగా పలకరించలేరు, ముందుకెళ్లి పరిచయం చేసుకోలేరు. ఈ ఒక్క కారణం వల్లే తనెంత మంచివాడైనా, నేస్తం కోసం ప్రాణమిచ్చే స్వభావమైనా వీరికి ఒక్క స్నేహితుడూ ఉండడు. ఒంటరితనంలోంచి ఆత్మన్యూనత పుడుతుంది.* అందుకనే బిడియస్తులైన పిల్లలను.. ఏవేనీ ఫంక్షన్లలోనూ, వివాహ వేడుకల్లోనూ అమ్మానాన్నలే చొరవగా పిల్లలున్న చోటికి తీసుకెళ్లాలి. అందరికీ పరిచయం చేయాలి. దీనివల్ల వీరిలో మెల్లిగా బెరుకు తగ్గుతుంది. ఫలహారానికో, ఐస్‌క్రీమ్‌కో తోటిపిల్లల్ని ఇంటికి పిలవమని పెద్దలు వీరిని ప్రోత్సహించాలి. ఇలా చేసినట్లయితే నిదానంగా పిల్లల్లో స్నేహం ఏర్పడి, బలపడుతుంది.* ఎవరితో స్నేహం చేయాలో, ఎవరిని దూరంగా ఉంచాలో పిల్లలనే నిర్ణయించుకోనివ్వాలి. తప్పనిసరి పరిస్థితుల్లోనే పెద్దలు జోక్యంచేసుకోవాలి. ఇతరుల వస్తువులు ముట్టుకోకూడదు. ఇతరుల గురించి చులకనగా మాట్లాడకూడదు. చెప్పుడు మాటలు వినకూడదు. అనవసరంగా గొడవలకు దిగకూడదు... ఇలాంటి విషయాలను పిల్లలకు తప్పకుండా నేర్పించడం మంచిది. |