* బొమ్మల్లో మనకు పిల్లల సంతోషం మాత్రమే కనిపిస్తుంటుందిగానీ... కాస్తంత ఆలోచిస్తే వాటివల్ల ప్రయోజనం కూడా ఉంటుంది. మాటరాని బొమ్మలు బుడిబుడి నడకల, తడి తేనె పలుకుల పిల్లలకు ఎన్నో విషయాలను మౌనంగానే నేర్పిస్తాయి. భావోద్వేగాల అర్థాలను గోరుముద్దల్లాగా తినిపిస్తాయి. ప్రేమ, ఆప్యాయత, అనురాగం, బంధం... లాంటి మనిషికీ మనిషికీ మధ్య ఉండే సకల ఉద్వేగాల సారాన్ని పిల్లల్లో అవి మెల్లగా నాటుతాయి.* బెల్లంకొట్టిన రాయికిమల్లే ఉండే స్తబ్దంగా ఉండే పిల్లల్ని అలాగే వదిలివేస్తే మానసిక సమస్యల బారిన కూడా పడవచ్చు. కాబట్టి మన పిల్లల కళ్లు హుషారుగా మెరుస్తూ ఉండాలన్నా, వాళ్ల అనుభూతులను మనతో పంచుకోవాలన్నా.. వాళ్లు అడిగినా, అడగకపోయినా ఒక బొమ్మయినా కొనిపెట్టడం మంచిది. * బొమ్మ కొనిచ్చిన తరువాత గమనిస్తే... ఎక్కువగా మాట్లాడని పిల్లలు కూడా గలగలా మాట్లాడేయవచ్చు. నవ్వకుండా ఉండే పిల్లల ముసిముసి నవ్వుల పువ్వుల్ని మీ దోసిళ్లలో కుమ్మరించనూ వచ్చు. స్నేహం అంటే తెలుసుకోవచ్చు. అలుపెరుగని నదిలా, గలగలా పారే సెలయేరులాగా మీ చిన్నారులు ఇట్టే మారిపోవచ్చు కూడా...! కాబట్టి, వీలయితే ముందుగా ఓ బొమ్మను కొనిచ్చేందుకు రెడీ అవుతారుకదూ...?! |