* పిల్లలకీ బుర్ర ఉంది, ఆలోచించనివ్వాలి. వారికీ ఇష్టాయిష్టాలున్నాయి, తీర్చుకోనివ్వాలి. పిల్లలకీ తెలివితేటలున్నాయి, వారినే నిర్ణయించుకోనివ్వాలి. కానీ పెద్దలు వారికి ఆ అవకాశం ఇవ్వకపోవచ్చు. పెద్దలు ఎప్పుడూ తమవైపునుంచే ఆలోచిస్తూ, నిర్ణయాలు వారే తీసేసుకుంటుంటారు. ఇది సరైన పద్ధతి కాదు. ఇలా చేసినట్లయితే... పిల్లల్లోని విచక్షణ జ్ఞానాన్నీ, నిర్ణయాలు తీసుకునే శక్తినీ పెద్దలే చేజేతులా నాశనం చేసినట్లే..! * అందుకనే పెద్దలు చిన్నారులకు చిన్నప్పట్నుంచే చిన్నచిన్న విషయాల్లో వాళ్లకు నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. టీషర్ట్ వేసుకోవాలో, చొక్కా వేసుకోవాలో వాళ్లనే నిర్ణయించుకోనివ్వాలి. అలాగే మ్యూజిక్ క్లాసులకెళ్లాలో, టెన్నిస్ ఆడాలో వాళ్లనే చెప్పమని అడగాలి. ఏ కోర్సులో చేర్పిస్తే బాగుంటుందని చాలామందిని అడిగినట్లే మీ పిల్లలను కూడా ఒక్కసారి అడగటం మంచిది. ఇలా పిల్లల అభిప్రాయాలకు విలువనిస్తే నష్టం ఏమీ ఉండదు.* కుటుంబానికి సంబంధించిన నిర్ణయాల్లోనూ పిల్లలకి స్థానమివ్వాలి. ఇంటికి ఏ రంగు వేయాలి, ఏ రంగు టైల్స్ వాడాలి, ఇంటీరియర్స్ ఎలా ఉండాలి... ఇలా అనేక విషయాల్లో పెద్దలు నిర్ణయావకాశం ఇచ్చిన ప్రతిసారీ పిల్లల్లో బాధ్యత పెరుగుతుంది, ఆలోచనాశక్తి పెరుగుతుంది. కొన్నిసార్లు ఆ నిర్ణయాలు తప్పుకావచ్చు. అయినా నష్టం లేదు. అదో పాఠం. ఆ అనుభవం నుంచి కూడా వారు నేర్చుకోవాల్సింది ఎంతో కొంత ఉండే ఉంటుంది. అదే విషయాన్ని పిల్లలకు చెప్పి ధైర్యం నింపాలి. |