* ఇంటికి స్కూలు ఎంత దూరంలో ఉంది, ఒకవేళ నడిచి వెళ్లే దూరమైతే, వారినే వెళ్లిరమ్మని చెప్పాలి. ఆలస్యం అవుతుందని పొద్దుటిపూట స్కూల్లో దింపినా, సాయంత్రాలు వారంతట వారే జాగ్రత్తగా ఇంటికి వచ్చేలా చేయాలి. కొన్నిరోజులు వారి వెంటనే ఉంటే, అలవాటవుతుంది. పిల్లలతో కబుర్లు చెప్పుకుంటూ రావడం వల్ల తల్లిదండ్రులకు పిల్లలతో చక్కని సంబంధాలు ఏర్పడతాయి. * ఎదిగే పిల్లలకు వ్యాయామంతోపాటు, సూర్యరశ్మి ఎంతో అవసరం. అప్పుడే వారికి అవసరమైన డి విటమిన్ అందుతుంది. కాబట్టి సెలవు దినాల్లోనూ వారికి ఏదో ఒక పని అప్పగించాలి. ఇంటిపరిసర ప్రాంతాల్లో ఉండే పువ్వులు, ఆకులు కోసుకురమ్మని చెప్పాలి. ఇలా చేసినట్లయితే పిల్లలు పరోక్షంగా సహజమైన ప్రకృతి ఒడిలో సేదదీరిన వారవుతారు. * ఎట్టిపరిస్థితుల్లో పిల్లలు రోజూ గంటన్నర సేపు ఆడినట్లయితే... అదనంగా వ్యాయామం అవసరం ఉండదు. పిల్లలు కదా అనే ఉద్దేశంతో కొందరు తల్లులు పుస్తకాల సంచీలు మోస్తుంటారు. అలా చేయడం సరికాదు. ఎందుకంటే, వారికి బరువు గురించి ఏ మాత్రం తెలియదు. దాంతో అవసరమైనప్పుడు బ్యాగును మోయాల్సి వస్తే పెద్దభారంగా భావిస్తారు. అందుకే మీరు వారి బరువును పంచుకోండి కానీ, మోయకూడదు.* అలాగే తరగతి గదిలో కూడా నిటారుగా కూర్చోమని చెప్పండి. వీపుభాగం బెంచి లేదా కుర్చీకి ఆనుకునేలా కూచోవాలి. పాదాలు నేలకు తగలాలి. పూర్తిగా నిటారుగా ఉండాలి. అప్పుడే నల్లబోర్డూ స్పష్టంగా కనిపిస్తుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే, చదువుతోపాటు వేళపట్టున నిద్రకూడా తప్పనిసరి. అందుకే రోజూ ఒకే సమయంలో నిద్ర పోవడం, నిద్రలేవడం అలవాటు చేయాలి. |