* పొగడ్త పన్నీరు లాంటిదని పెద్దలు అంటుంటారు. అయితే పొగడ్తలవల్ల మంచి, చెడూ రెండూ జరుగుతుంటాయి. అందుకే పొగడ్తలెప్పుడూ అతిశయోక్తులుగా ఉండకూడదు. పిల్లల్ని పొగిడేటప్పుడు వారిని మరీ గారంచేసి.. మీ అంతటివారు లేరని అన్నట్లయితే, వారిలో అహంకారం ఎక్కువై మాటవినని మొండివారుగా తయారయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త..!
* పిల్లలు కొత్తగా ఏదైనా పని చేసి చూపించినప్పుడు వారి తప్పుల్ని ఎత్తిచూపకుండా, వారి ఉత్సాహాన్ని ప్రోత్సహించేలా పొగడాలి. మీ చిన్నారి తోటి పిల్లలతో తన లంచ్ బాక్స్‌ను షేర్ చేసుకున్నందుకు తిట్టకుండా అభినందించాలి. ఇలా చేస్తే పిల్లల్లోని సేవా గుణాన్ని పెంచేందుకు తోడ్పడినట్లవుతుంది.
* తోటి పిల్లలు ఎవరైనా మీ చిన్నారికి సహాయం చేసినట్లయితే వారికి కృతజ్ఞతలు చెప్పేలా ప్రోత్సహించండి. పక్కింటి ఆంటీకి చిన్న చిన్న పనులు చేసిపెట్టినందుకు పిల్లల్ని కోప్పడకుండా, ప్రోత్సహించాలి. ఇలా చేస్తే వారికి చిన్నతనం నుంచే పనులు చేయటం అలవాటు అవుతుంది. అమ్మమ్మ రోడ్డు దాటుతుంటే, నేను సాయంగావెళ్లి దాటించి వచ్చానమ్మా అని పిల్లలు చెబితే వారిని ప్రశంసించాలి.
* పొగడ్త అనేది ఒక రకమైన గుర్తింపును ఇస్తుంది, ఉత్సాహాన్ని ఇస్తుంది. మనపై మనకున్న నమ్మకాన్ని పెంచుకునేందుకు అది బాగా ఉపయోగపడుతుంది. అయితే ఎప్పుడూ ఎవరో ఒకరు మనల్ని గుర్తించి పొగుడుతూ ఉండాలని ఆశించకూడదు. ఒక్కోసారి ఎంతో సమర్థవంతంగా పనిచేసినా కూడా ఆ సమయంలో గుర్తింపు రాదు. అలాంటి సమయంలో కుంగిపోకుండా, మనలోని మంచి గుణాలను పెంపొందించుకోవాలి.