* పిల్లలకు పుస్తకాలు జాగ్రత్తగా చూసుకోవడం బాల్యం నుంచే అలవాటు చేయాలి. వాటిని శుభ్రంగా ఉంచుకోవడం, అందంగా అమర్చుకోవటం లాంటివి తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల ఆ పుస్తకంతో పాటు, చదువు మీద శ్రద్ధ ఏర్పడుతుంది. తమ బాధ్యతగా భావించడం వల్ల క్రమశిక్షణ కలుగుతుంది.
* పుస్తకాలను చక్కగా ఉంచుకొన్న విద్యార్థికి తరగతిలో కూడా ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దీంతో ఆత్మవిశ్వాసం ఏర్పడి ఏ పనిలో అయినా సృజనాత్మకత ప్రదర్శించే అవకాశం కలుగుతుంది. మానసికంగా కూడా అందరి కంటే చురుకుగా ఉంటారు. ఇలాంటి పిల్లలు పెద్దయిన తర్వాత ప్రతి విషయాన్ని ప్రణాళికాబద్ధంగా ఆలోచించగలుగుతారు.
* పుస్తకాలకు అందమైన రంగురంగుల వాటర్ ఫ్రూఫ్ అట్టలు దొరుకుతున్నాయి. పసుపు, గులాబీ, నీలం, ఊదా లాంటి విభిన్న రంగులు వస్తున్నాయి. ఒక్కొక్క పాఠ్య పుస్తకానికి ఒక్కో రంగు అట్ట వేస్తే టైంటేబుల్ ప్రకారం వెంటనే తీసుకెళ్లవచ్చు. మరీ ముదురు, మరీ తెలికపాటి రంగులను మధ్యస్థంగా ఎంచుకుంటే ఆకర్షణీయంగా ఉంటాయి.
* అట్ట వేసిన తర్వాత నాలుగు మూలలా నాలుగు పిన్నులు వేస్తే బాగుంటాయి. ఒకేరకమైన లేబిల్ అతికించి పేరు రాస్తే పాఠశాలలో పుస్తకాలు మారకుండా ఉంటాయి. చిన్న పిల్లలకు కార్టూన్, అంకెలు, పండ్లు, బొమ్మలతో కూడిన అట్టలు వేస్తే వారు పుస్తకాల్ని జాగ్రత్తగా చూసుకుంటారు. వాటి మీద ఉన్న అక్షరాలు వల్ల పదాలు, బొమ్మలు వేగంగా గ్రహించగలుగుతారు.