* మామూలుగా పిల్లలకు పోషకతత్వాలు ఎక్కువగా వుండే ఆహారం తినిపిస్తుండాలి. పరీక్షల సమయంలో మరింత జాగ్రత్తగా వారికి శక్తినీ, బలాన్నీ, ఉత్సాహాన్నీ కలిగించే ఆహారం పెట్టాలి. అదే సమయంలో చాక్లెట్లు, బర్గర్లు, కోల్డ్ డ్రింక్స్ లాంటి జంక్‌ఫుడ్‌ను దూరంగా ఉంచాలి. వాటికి బదులుగా పళ్లు, పౌష్టికతత్వాలుండే ఆహారాన్ని ఎక్కువగా ఉంచాలి.
* చదువు వల్ల పిల్లల్లో టెన్షన్, ఒత్తిడులు కలుగుతాయి కాబట్టి.. శరీరానికి విటమిన్లు, ఖనిజలవణాలు అవసరమవుతాయి. పగలూ, రాత్రీ కూడా పిల్లలకు శక్తిని బాగా అందజేసే ఆహారాన్నే పెట్టాలి. ఉదయం తినిపించే అల్పాహారం కూడా ఆరోగ్యదాయకంగా వుండాలి. నిమ్మరసం, వేడి నీటిలో హార్లిక్స్ కలిపి, పిల్లల చేత తాగించాలి.
* టొమాటోలు, కీరాలు, బీట్‌రూట్ వంటి కూరలతో సలాడ్ చేసి, వాటి మీద నిమ్మరసం, చాట్ మసాలా చల్లి ఇవ్వాలి. వీటి వల్ల ఆకలి తీరటంతోపాటు మనస్సుకూ, శరీరానికీ కూడా తగినంత బలం చేకూరుతుంది. పిల్లలకు బంగాళాదుంపలు ఇష్టమైతే, వాటిని ఉడికించి, ఛాట్ తయారు చేసి ఇవ్వాలి. ఉడికించిన బంగాళ దుంపల మీద కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి నిమ్మరసం చల్లి, పైనుంచి మొలకెత్తిన పెసలు, శెనగలు కలిపి ఇవ్వాలి. నిద్ర లేచాక, పిల్లలకు వేడిపాలు లేదా టీ ఇవ్వాలి. గ్లూకోజ్, ఎలక్ట్రాల్, పళ్లరసాలను తాగించాలి. వీటివల్ల పిల్లలకు తక్షణశక్తి చేకూరుతుంది.