* ఇదివరకటి రోజుల్లో పిల్లలు శారీరక వ్యాయామాలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు. ఇంటిపనుల్లో అంతో, ఇంతో సాయంగా ఉండేవారు. కానీ ఈనాటి పిల్లలు ఔట్ డోర్ ఆటలకు ఫుల్‌స్టాప్ పెట్టేయటమేగాక, ఇండోర్ ఆటలకు కూడా చెక్ పెట్టేశారు. స్కూలు నుంచి ఇంటికి రావటం ఆలస్యం టీవీలకు అతుక్కు పోతున్నారు. ఏదో సరదా పడుతున్నారు కదా అని అలా వదిలేస్తే అది పిల్లల్లో హింసాత్మక ప్రవృత్తికి దారితీస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
* ఖాళీ దొరికితే చాలు కార్టూన్ ఛానెల్స్‌కు అతుక్కుపోయే పిల్లలకు టామ్ అండ్ జెర్రీ అంటేనే విపరీతమైన క్రేజ్. కానీ దాంట్లో వస్తున్న హింసాత్మక దృశ్యాలు పిల్లలపై ప్రభావాన్ని చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. టామ్ సుత్తి తీసుకుని జెర్రీని కొట్టడం, తుపాకీతో కాల్చటం, టామ్ అండ్ జెర్రీలు ఎప్పుడూ గొడవపడుతుండటం లాంటివి చూసేందుకు ఫన్నీగా ఉన్నా.. అవి పిల్లల్లో హింసాత్మక ప్రవృత్తికి దారి తీస్తాయి. కాబట్టి పిల్లలు టీవీ చూసేటప్పుడు తల్లిదండ్రులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలి.
* పిల్లలు ఏయే ప్రోగ్రాములు చూడాలో, ఏవి చూడగూడదో నిర్ణయించుకుని వారికి పెద్దలు మెల్లిగా నచ్చజెప్పాలి. హారర్ సినిమాలు, భయానక దృశ్యాలు చూసినప్పుడు పిల్లల్లో ఒక రకమైన ఫోబియా అభివృద్ధి చెందుతుంటుంది. దాంతో చీకటంటే భయపడటం, తరచూ ఉలిక్కిపడటం లాంటి వాటికి వారు గురవుతుంటారు. దెయ్యం లేదా భూతం చీకట్లో వస్తుందని టీవీలో చూడటంవల్ల వారి లేత మనసుల్లో ముద్రించుకుపోవటంవల్లనే వారలా భయపడుతుంటారు. కాబట్టి.. పిల్లలకు అర్థం చేసుకోగలిగే వయసు వచ్చేదాకా అలాంటి వాటికి దూరంగా ఉంచటం పెద్దల బాధ్యత.