* పిల్లల పెంపకమనేది మాటల్లో చెప్పుకునేంత సులువయినది కాదు. వివిధ దశల్లో విభిన్న రకాలుగా మారుతుండే వారి భావోద్రేకాల్ని ఎంతో ఓర్పుతో, నేర్పుతో ఎదుర్కొనాల్సి ఉంటుంది. పిల్లల్ని గౌరవంగా పెంచుకోవాలే తప్ప వారిని అనుక్షణం అవమానభారంతో కుంగదీయకూడదు. పిల్లల పెంపకం కూడా కొన్ని వ్యూహాలతో సాగాలి. ఆయా సందర్భాలలో ఖచ్చితంగా వ్యవహరిస్తూనే పిల్లల అవసరాల పట్ల సర్దుబాటు ధోరణితో ఉండాలి.
* పిల్లల చర్యలు బాగా లేనప్పుడు మాటల పనిలేకుండా సంజ్ఞలతో వారిని నియంత్రించగల అలవాటు తప్పనిసరిగా చేయాలి. ఇటువంటి సుతిమెత్తని ఆదేశాలు వారిని ఇబ్బంది పెట్టకపోగా, ప్రోత్సాహకంగా ఉంటాయి. ఇలా ప్రతి సంఘటనకూ ముందస్తుగా సిద్ధం చేయడం వల్ల వారి భావి విజయాలకు దోహదపడతాయి. పబ్లిక్‌లో పిల్లలు, పెద్దలు ఇబ్బందికి గురయ్యే అవకాశాలుండవు.
* పిల్లల్ని ఏదైనా దుకాణానికి, సినిమాకు లేదా మరెక్కడికైనా బయటకు తీసుకువెళ్ళదలచుకుంటే అక్కడ ప్రవర్తన గురించి ముందుగానే చెప్పాలి. అలా పిల్లలకు ముందుగానే పరిస్థితుల్ని ఆకళింపు చేసినట్లయితే తదుపరి పరిణామాల్ని వారికి స్వేచ్ఛగా వివరించే అవకాశం కలుగుతుంది. లేనట్లయితే పిల్లలు తమకేం తెలియదంటూ సందర్భాన్ని దాటవేసే అవకాశం ఉంటుంది.