ప్రధాన పేజి » ఇతరాలు » బాలప్రపంచం » చైల్డ్ కేర్ » చిన్నతనం నుంచే ప్రతి పనికీ ఓ టైం టేబుల్...! (Child Care | Schedule | Time Table | Kids | Parents | Time | Home Work | Routine)
* ఒక పద్ధతిని, ఒక సమయాన్ని పాటిస్తూ పనులు పూర్తి చేసుకోవటాన్ని పిల్లలకు చిన్నతనం నుంచే నేర్పాలి. రోజువారీ కార్యక్రమాలు ఓ షెడ్యూల్ ప్రకారం సాగితే ఏ రకమైన ఇబ్బందీ, ఒత్తిడీ వారిపై ఉండదు. పిల్లలు వారి టైంటేబుల్‌ను తు.చ. తప్పకుండా పాటించటం సాధ్యం కాకపోవచ్చు. కానీ, వీలైనంత వరకు ప్రయత్నిస్తుంటే నెమ్మదిగా దానికి అలవాటు పడిపోతారు.
* టైంటేబుల్‌ను అనుసరించి పనులు చేసుకునే పిల్లలకు సమయం విలువ, సమయ పాలన బాగా అలవాటవుతాయి. ఏ పని ముందు, ఏ పని వెనుక అనే జంజాటన వారికి ఉండదు. పిల్లలకంటూ ఓ రొటిన్‌ను అలవాటు చేసి, ఆ వరుసలో పనులు చేసుకోవాల్సిందిగా ప్రోత్సహిస్తే, హుషారుగా వారి పనులు వారు చేసుకుంటూ పోతారు.
* ఒక షెడ్యూల్ ప్రకారం పనులు సాగించే పిల్లలు ప్రతి పనిని గబగబా ముగించేసి, కొంత సమయాన్ని ఆదా చేసుకోవాలని చూస్తుంటారు. అలాగే హోంవర్కులు ముగించేందుకు కూడా ఓ పట్టిక తయారు చేసుకోవాల్సిందిగా పెద్దలు వారికి సలహా ఇవ్వాలి. ఇంకా రోజువారీ పనులు, వారాంతపు పనులు, నెలవారీ పనులకు కూడా విడివిడిగా పిల్లలకు షెడ్యూల్ తయారు చేసివ్వాలి.
* టైం టేబుల్ తయారు చేసే సమయంలో పిల్లల్ని కూడా కూర్చోబెట్టుకుని వివరిస్తే వారికి కూడా కుతూహలం, ఉత్సాహం పెరుగుతాయి. చిన్నతనం నుంచి ఓ పద్ధతి, సమయపాలన అలవడితే వారు ఎదిగేకొద్దీ లక్ష్యాన్ని అందుకోవటంలో ముందుంటారు.