పిల్లలూ...! కాగితాన్ని చింపినప్పుడు ఒక రకమైన శబ్దం వస్తుంది కదా..! అలా శబ్దం ఎందుకు వస్తుంది? అసలు కాగితాన్ని ఎలా తయారు చేస్తారు? లాంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..!
కాగితాన్ని కొయ్య, పీచు తదితర పదార్థాల గుజ్జుతో తయారు చేస్తారు. ఈ గుజ్జునే "సెల్యులోజ్" అని అంటారు. దీనిని రోలర్ల సహాయంతో ఒత్తిడికి గురి చేసి ఎండబెడితే కాగితం తయారవుతుంది.
'సెల్యులోజ్' అనేది కొంత దృఢత్వమున్న సన్నటి పోగుల రూపంలో ఉంటుంది. ఈ పోగుల వద్ద అతుక్కుని ఉండే బలాలు ఉంటాయి. కాగితాన్ని చింపినప్పుడు ఆ 'బలా'లను అధిగమించడం వల్ల... పోగులు ఒక దాని తర్వాత మరొకటి కాగితంలో కంపనాలు సృష్టిస్తాయి. ఈ కంపనాలు కాగితం చుట్టూ ఉండే గాలిలో శబ్దతరంగాలను కలిగించడం వల్ల మనకు శబ్దం వినిపిస్తుంది.
కాగితాన్ని ఎంత వేగంగా చింపితే... అన్ని ఎక్కువ పోగులు తెగడంతో కంపనాల పౌనఃపున్యం అంత ఎక్కువై మనకు వినబడే కీచుతనం లేదా స్థాయి కూడా ఎక్కువవుతుంది. అదే నీటితో తడిసిన కాగితాన్ని చింపినప్పుడు శబ్దం రాదు.
ఎందుకంటే... నీటి అణువులు కాగితంలోని సెల్యులోజ్ పోగుల మధ్య ప్రదేశాల్లో చేరడం వల్ల... వాటిమధ్య అతుక్కుని ఉండే 'బలాలు' బలహీనపడి అవి సులభంగా నిశ్శబ్దంగా తెగిపోతాయి. కాబట్టే, శబ్దం రాదు...! హమ్మయ్య...! కాగితపు శబ్దం ఎలా ఏర్పడుతుందో తెలుసుకున్నాం కదూ..!
|