పిల్లలూ..! గోడ నుండి వచ్చే నీడ కంటే చెట్ల నీడ చాలా చల్లగా ఉంటుంది కదా...! ఈ రెండు నీడల మధ్య తేడా ఏంటి? ఎందువల్ల ఇలా జరుగుతుందన్న విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.!
గోడ అనేది ఎలాంటి జీవమూ లేని ఒక ఘన పదార్థం మాత్రమే. దృశ్య కాంతి గోడలోంచి ఏ మాత్రం దూసుకుపోదు కాబట్టి, గోడకు ఇవతలవైపు నీడ ఏర్పడుతుంది. అయితే.. సూర్యకాంతిలో దృశ్యకాంతితో పాటుగా, చాలా శక్తివంతమైన అతినీలలోహిత కాంతి, ఉష్ణభాగం అధికంగా ఉండే పరారుణ కాంతి కూడా ఉంటాయి.
గోడమీద పడిన కాంతిలో కొంత భాగం అవతలి వైపున పరావర్తనం చెందినప్పటికీ, మిగతా కాంతిని గోడ పదార్థం శోషించుకుంటుంది. ఇలా కాంతి శక్తి గోడలో ఉష్ణశక్తిగా మారి గోడ నుంచి గోడ నీడలో ఉష్ణవాహనం ద్వారా ప్రసరిస్తుంది. అందులో కొంత భాగం గోడకు ఇవతలి వైపుకు కూడా వస్తుంది. దీని వల్లనే మనకు గోడ నీడలో ఉక్కబోసినట్లుగా అనిపిస్తుంది.
అయితే... తన ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించే యంత్రాంగం చెట్లకు ఉంది. ఆకుపై పడిన కాంతి కొంత పరావర్తనమైనా, మరి కొంత భాగం కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడుతుంది. మిగిలిన కాంతి ఆకు కణాల ఉష్ణోగ్రతను పెంచకముందే ఆకు భాష్పోత్సేకం ద్వారా నీటి ఆవిరిని విడుదల చేస్తూ కాంతిశక్తిని తటస్థపరుస్తుంది.
ఈ రకంగా... తమ ఉష్ణోగ్రతను తక్కువగా ఉంచుకునే వేలాది ఆకులను తాకి చల్లబడిన గాలి, ఆ చెట్టు నీడన ఉన్న మనల్ని తాకగానే హాయిగా అనిపిస్తుంది. చల్లగా రారమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా ఉంటుంది.
|