పిల్లలూ...! భరతమాత సంకెళ్లను తెంచేందుకు, అలుపెరుగని పోరాటం సాగించిన స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్ గురించి మీకు తెలుసు కదా... దేశ స్వాతంత్యం కోసం ఉరితాడునే పూమాలగా మెడలో వేసుకున్న ధైర్యశాలి ఆయన. అలాంటి గొప్ప వ్యక్తి జీవితంలోని కొన్ని ఘట్టాలను ఇప్పుడు మనం చూద్దాం...!
ఇప్పుడు పాకిస్థాన్ దేశంలో అంతర్భాగమైన లాయల్‌పూర్ జిల్లా బంగా గ్రామంలో భగత్‌సింగ్ సెప్టెంబర్ 27వ తేదీ 1907వ సంవత్సరంలో జన్మించారు. చిన్నవయస్సులోనే లాలాలజపతిరాయ్, రాస్ బిహారీ బోస్ లాంటి ప్రముఖులను కలిసి స్వాతంత్రోద్యమ పోరాటం పట్ల ఆకర్షితులయ్యారు.
1921వ సంవత్సరంలో స్కూలు చదువు వదిలిపెట్టి మహాత్మాగాంధీ ఇచ్చిన పిలుపుతో నేషనల్ కాలేజీలో చేరిన భగత్... ఆ తరువాత విప్లవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ క్రమంలో అహింసావాదంతో తెల్లవారిని ఎదుర్కోవడం సాధ్యంకాదని, ఆయుధాలతోనే వారిని తరిమికొట్టగలమని భావించి, ఆవైపు అడుగులు వేశారు.
లాలాలజపతిరాయ్ 1928వ సంవత్సరంలో బ్రిటీష్ వారు చేసిన దాడిలో మరణించాడు. దీనికి ప్రతీకారంగా జనరల్ స్కాట్‌ను చంపబోయిన భగత్, పొరబాటున మరో బ్రిటీషు అధికారిని కాల్చిచంపాడు. అక్కడ్నించీ పారిపోయి ఆయన, కొన్నాళ్ల తరువాత అసెంబ్లీ దగ్గర బాంబులు విసిరాడు. సుఖదేవ్, రాజగురులతో స్వచ్చంధంగా లొంగిపోయిన భగత్... 23 ఏళ్ల వయస్సులో బ్రిటీష్ వారిచే ఉరితీయబడ్డాడు.
|