పిల్లలూ...! చీమలతో ఆపరేషన్ కుట్లు ఏంటి? అనుకుంటున్నారా..? మనకు ఏదేని పెద్ద గాయం అయితే ఆపరేషన్ చేసి, చర్మాన్ని కలిపి కుట్లు వేస్తారు కదా...? అలా కుట్లు వేసేదానికి ప్రాచీన కాలంలో గండుచీమలను ఉపయోగించేవారట..! ఆ కథేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం...!
ప్రాచీన భారతదేశంలో సుప్రసిద్ధ వైద్యుడు, శస్త్రచికిత్సా పితామహుడు అయిన సుశృతుడు తన జీవిత కాలంలో ఎన్నో శస్త్రచికిత్స (ఆపరేషన్)లను చేశాడు. ఆయన శస్త్రచికిత్స చేసేటప్పుడు కోసిన శరీర ప్రాంతాన్ని కలిపి కుట్టేందుకు ఎర్రని గండుచీమలను వాడేవారట..!
శస్త్రచికిత్స పూర్తయిన తరువాత, చర్మాన్ని కోసిన చోట రెండు చర్మభాగాలను ఒక దగ్గరకు చేర్చి బిగించి పట్టుకునేవారు. ఆ తరువాత ఒక ఎర్రని గండు చీమను ఒడుపుగా పట్టుకుని దాని మూతి భాగాన్ని ఆ భాగంలో ఆనించేవారు. అలా ఆనించినప్పుడు చీమ ఎప్పుడైతే కుడుతుందో అప్పుడే.. దాని కొండెం మొదలును కత్తిరించేవారు.
దీంతో ఆ చీమ తాలూకు కొండెం మనిషి చర్మంలో ఇరుక్కుని అలాగే ఉండిపోయేది. ఇలా ఒక చీమ తరువాత మరొకదాన్ని ఉపయోగిస్తూ మొత్తం ఎన్ని కుట్లు అవసరమైతే అన్ని కుట్లు వేసేవారట. కొంతకాలానికి చీమల కొండెలతో వేసిన కుట్లు, గాయం మానిపోగానే చర్మం అతుక్కుపోయేలా చేస్తాయి.
|