పిల్లలూ...! ఈరోజేంటో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఉపాధ్యాయవృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టిన రోజైన సెప్టెంబర్ 5న ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది కదా...! ఉపాధ్యాయుడి పాత్ర అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ గురుతరమైనదే. అలాంటి బోధనావృత్తికి తలమానికంగా నిలిచిన సర్వేపల్లి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం...!
ఆచార్య రాధాకృష్ణ నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యా వృత్తిలో ఉండి విద్యార్థుల మధ్యనే గడిపారు. ఎదుటివారికి బోధించటం వల్ల, తన విజ్ఞానం కూడా వృద్ధి చెందుతుందని మనసా వాచా నమ్మిన వ్యక్తి ఆయన. వేలాదిమంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆయన తర్కం లాంటి కష్టమైన అంశాన్ని కూడా విద్యార్థులకు సులభంగా బోధించేవారు.
ఆధునిక కాలంలో విద్యార్థికి, ఉపాధ్యాయుడికీ మధ్య సంబంధం ఎలా ఉండాలో కూడా ఆచార్య రాధాకృష్ణ జీవితం అనేక పాఠాలను నేర్పుతుంది. అధ్యాపకుడిగా, వైస్‌ఛాన్సలర్‌గా, దౌత్యవేత్తగా, ఉపరాష్ట్రపతిగా ఆయన అధిరోహించిన శిఖరాలు ఆయన జీవితంలోని అసాధారణ కోణాలను మనకు వెల్లడి చేస్తాయి.
విద్యార్థిలోని అజ్ఞానాన్ని తొలగించేవాడు గురువు. అందుకే భారతీయ పరంపర గురువుకు ఓ గొప్ప స్థానాన్ని కల్పించింది. ఆ స్థానాన్ని ప్రస్తుతం ప్రపంచం మొత్తం నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ బాధ్యతను ఎప్పుడూ గుర్తు చేసే విధంగా మనం ప్రతి సంవత్సరం సర్వేపల్లి జన్మదినం సందర్భంగా గురుపూజోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీనిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, బాలలను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి.
|