ఇక అప్పట్నినుంచీ ఎస్వీఆర్ వెనుదిరిగి చూడలేదు. పాతాళభైరవి, పెళ్ళి చేసి చూడు, బంగారుపాప, బాలనాగమ్మ, గృహలక్ష్మి, బాల భారతం, తాతా మనవడు ఇలా అనేక చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి తన అద్భుత నటనాచాతుర్యంతో సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేశారు.
ఆయనలోని గంభీర స్వరం, మాటల్లోని ఈజ్, మాట విరవడంలో, అభినయంలో ఆయనకు ఆయనే సాటి. పౌరాణిక పాత్రలకు సరిపోయే ఆహార్యం, రాజసం, ఠీవి, దర్పం ఆయన సొంతం. ఏ పాత్రలోనైనా ఇట్టే ఎదిగిపోగా ఆయన స్వభావంతో పాటు, ఆయన పాత్రలు కూడా ఆయన్లో ఒదిగిపోయి "వహ్వా" అనిపిస్తాయి.
కళ్లతో మాట్లాడుతూ.. కనుబొమలతో మనల్ని కదలించే మహానటుడు ఎస్వీఆర్. అందుకే ఆయన "నర్తనశాల"లో నటించిన కీచక పాత్రకి జకార్తాలో జరిగిన "ఫిల్మ్ ఫెస్టివల్"లో ఉత్తమ నటుడిగా బహుమతినందుకున్నారు. అప్పట్లో అంతర్జాతీయ స్థాయిలో అవార్డునందుకున్న తొలి నటుడు కూడా ఆయనే...!
1946లో వచ్చిన ‘వరూధిని’ చిత్రం నుంచి 1974లో విడుదలైన ‘యశోధకృష్ణ’ సినిమా వరకు తెలుగులో నూట అరవై చిత్రాలు, తమిళంలో నూరు చిత్రాలు, కన్నడంలో రెండు, మలయాళంలో మూడు, హిందీలో మూడు చిత్రాల్లో నటించారు. అభిమానులు ప్రేమతో ‘విశ్వనట చక్రవర్తి, నటసార్వభౌమ, నటశేఖర, నటసింహ’ వంటి బిరుదులతో ఘనంగా సత్కరించారు. అనేక పర్యాయాలు ఉత్తమ నటుడు, ఉత్తమసహాయ నటుడి అవార్డులు, రాష్ట్రపతి పతకాలు పొందారు.
నిర్మాతగా "నాదీ అడజన్మే" చిత్రాన్ని, దర్శక నిర్మాతగా "చదరంగం, బాంధవ్యాలు" అనే చిత్రాలను రూపొందించారు. దర్శకుడిగా అవి ఆయనకు కీర్తి ప్రతిష్టలు తెచ్చాయి. వ్యక్తిగా చమత్కారి, హాస్యప్రియుడు, భేషజాలు లేని నిరాడంబరుడు, సామాజిక సేవా సంస్థలకు తన వంతు సాయం అందించడంలో ఏనాడూ వెనుకంజ వేయలేదు. భారత్-చైనా, భారత్-పాక్ యుద్ధాల సమయాల్లో ఆర్థిక సాయం అందించడమే కాక, నాటక ప్రదర్శనలతో దేశానికి రక్షణ నిధిని సమకూర్చారు.
వ్యక్తిగా రంగారావు సహృదయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఇష్టదైవం శివుడు. ప్రతిరోజూ శివపూజ చేసిన తర్వాత దినచర్య ప్రారంభించేవారు కారు. 1974 జులై 18న రెండోసారి వచ్చిన గుండెపోటుతో ఈ నటసార్వభౌముడు మద్రాసులో తుదిశ్వాస విడిచి అఖిలాంద్ర ప్రేక్షకులకు తీరని దుఃఖాన్ని కలిగించారు. భౌతికంగా ఆయన లేకుండా ఎన్నో ఏళ్లు గడిచినా, ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో ఆ నటచక్రవర్తి స్థానం ఎన్నటికీ చెరిగిపోనిది. |