పెద్దయ్యాక అనేక యుద్ధ విద్యల్లో ఆరితేరిన రామరాజు ఆనాడు గిరిజన ప్రజలు తెల్లదొరల చేతిలో అనేక దురాగతాలకు గురవటం చూసి చలించిపోయాడు. గిరిజనులు ధన, మాన, శ్రమ దోపిడికి గురవటాన్ని చూసిన ఆయన వారికి అండగా నిలిచి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. గిరిజనుల్లో చైతన్యం తీసుకొచ్చి, దురలవాట్లకు దూరం చేసి, వారికి యుద్ధ విద్యలు, గెరిల్లా యుద్ధ పద్ధతులను నేర్పించి పోరాటానికి సంసిద్ధులను చేశారు.
తమకు అండగా నిలిచిన అల్లూరిపై గిరిజనులు పూర్తి విశ్వాసాన్ని ప్రకటించి తమ నాయకునిగా స్వీకరించారు. 1922 సంవత్సరం ప్రాంతంలో మన్యంలో కాలుపెట్టిన సీతారామరాజు విప్లవానికి రంగం సిద్ధం చేశాడు. తన విప్లవ దళాలతో పోలీసు స్టేషన్లపై మెరుపుదాడులు నిర్వహించి బ్రిటిషు అధికారులను గడగడలాడించాడు.
సమాచారం ఇచ్చి మరీ పోలీసుస్టేషనులపై దాడుల నిర్వహించి బ్రిటిషు అధికారుల్లో ముచ్చెమటలు పట్టించాడు. ఈ సంఘటనల్లో బ్రిటిషు ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసినప్పటికీ వారిని ఎదిరించలేకపోయారు. అయితే అదే ఏడాది అల్లూరి సీతారామరాజు విప్లవదళానికి మొదటి ఎదురుదెబ్బ తగిలింది. 1922 డిసెంబరు 6న జరిగిన పోరులో 12 మంది అనుచరులను రామరాజు కోల్పోయాడు.
ఆ తర్వాత రామరాజు కొన్నాళ్లు నిశ్శబ్దం పాటించటంతో ఆయన మరణించాడనే పుకార్లు వ్యాపించాయి. అయితే అల్లూరి 1923 సంవత్సరం ఏప్రిల్ నెలలో మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. అయితే విప్లవాన్ని అణచివేసే కార్యక్రమంలో బ్రిటిషు అధికారులు, పోలీసులు ప్రజలను భయకంపితులను చేయటం మొదలుపెట్టారు.
ఈ పరిస్థితుల్లో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా లొంగిపోవాలని నిశ్చయించుకున్నాడు అల్లూరి. అయితే 1923 మే 7న ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా ఆయనను బంధించిన పోలీసులు ఎటువంటి విచారణ చేపట్టకుండానే అదే రోజున కాల్చిచంపారు. సాతంత్ర్యోద్యమ చరిత్రలో తెల్లదొరలకు సింహస్వప్నంగా నిలిచిన అల్లూరి... ఈ రకంగా భరతమాత విముక్తి కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి అమరవీరుడయ్యారు. |