ఇప్పుడు నా రెండెకరాలు కూడా ఆయనే ఆక్రమించుకున్నాడు. అడిగితే నీకు దిక్కున్నచోట చెప్పుకో? అన్నాడు. నాకున్న ఆధారం ఆ రెండెకరాలే స్వామీ!" అన్నాడు ఏడుస్తూ. "రెవెన్యూ వాళ్ళకు చెప్పుకున్నావా?" ప్రశ్నించాడు మంత్రి. "చెప్పుకున్నానయ్యా! ఆ పొలం పట్టా గణపతిరావుగారి పేరు మీద వుంది. అందులో నువ్వు అడుగుపెడితే పోలీసులు అరెస్టు చేస్తారు, వెళ్ళు అని కసురుకున్నారయ్యా" అన్నాడు బాధగా.
"రామయ్యా! నీకు తప్పకుండా సహాయం చేస్తాను . జరిగిందంతా మా సెక్రటరీతో చెప్పు. అర్జీ రాసిస్తాడు. క్రింద వేలిముద్ర వేసి ఇవ్వు. పొలం నీకు వచ్చేటట్లు నేను చేస్తాను" అని హామీ ఇచ్చాడు. రామయ్య అర్జీ రాయించి వేలి ముద్ర వేసి మంత్రిగారికి ఇచ్చాడు. ఆయన దానిని పూర్తిగా చదివి రంగారావు "రామయ్యకు వంద రూపాయలు చార్జీలకు ఇచ్చి పంపు" అన్నాడు సెక్రటరీతో. సెక్రటరీ ఇచ్చిన వంద తీసుకొని "వస్తానయ్యా! మీరే సాయం చెయ్యాలయ్యా!" అని వెళ్ళిపోయాడు రామయ్య.
బస్సెక్కి ఇంటికెళ్తున్న రామయ్య పొలం చేతికొచ్చినంత ఆనందపడిపోతూ సంబరపడసాగాడు. కానీ పాపం అతనికి తెలియని నిజం ఒకటుంది. ఆ నిజం కనీసం పత్రికల వాళ్ళకు కూడా తెలియదు. అదేమిటంటే రంగారావు గాంధేయవాది కాదు. బ్రాందేయవాది. అతడి రాగి చెంబులో వుండేది మంచితీర్ధం కాదు మేలురకం ఫారిన్ బ్రాందీ.
ఇంకో నిజం రామయ్య పొలం ఆక్రమించుకున్న గణపతిరావు రంగారావు బావమరిదికి బినామీ దారుడు. అన్నింటికంటే ఘోరమైన నిజం రామయ్యకు మంత్రిగారి సెక్రటరీ రాసింది అర్జీ లెటరు కాదు. అతడి పొలం గణపతిరావుకు అమ్ముతున్నట్లు రాసిన విక్రయ పత్రం. రేపు ఒకవేళ మళ్ళా రామయ్య వచ్చి అడిగితే " రాజయ్యా! నువ్వే పొలం అమ్మేశావు నేంనేం చేయగలను చెప్పు?" అని మంచిగా అందరిముందూ తప్పించుకోగలడు రంగారావు. |