రఘుపతి వస్తానని పోన్ చేశాడు. సరే, రారా . ఇంటివద్దే ఉన్నాను అన్నాను. ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదు. ఎటూ వెళ్లడంలేదు. మిత్రులుకూడా చాలామంది రావడం తగ్గించేశారు. ఎవరి పనులు వాళ్లకు.. సమయం సరిపోవడంలేదేమో.
పనమ్మాయిని పిలిచి మేడమీద గది శుభ్రంచేయమన్నాను. ఆ గది నా సామ్రాజ్యం. అయితే అక్కడికి వెళ్లి చాలా వారాలయింది. అంతకు ముందు ప్రతి శని, ఆదివారాలు నా మిత్రులతో, మేడపై గదిలో చాలా సరదాగా గడచిపోయేవి. కొందరితో పేక ఆట, కొందరితో చదరంగం, చందు, నాగరాజు వంటివారితో సాహిత్య చర్చ. ఇలా ఉండేది నా వారాంతపు జైత్రయాత్ర.
వీరందరిలోకీ రఘుపతి నాకు ప్రాణస్నేహితుడు. మాది చిన్ననాటి స్నేహం. మావి పక్కపక్క ఊర్లు. వాడి ఊరి స్కూల్లో నేను రెండేళ్లు చదువుకున్నాను. అప్పటినుండీ స్నేహం గత యాభై ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. చిన్ననాటి స్నేహం పర్సులోని కరెన్సీ నోట్లవంటిది. అప్పుడప్పుడూ తాకి చూసుకుంటే కలిగే ఆనందం వేరు. వాడు, వాడి ఆర్థిక స్థితి వాణ్ని డాక్టరు చదివించాయి.
నేను ఓ కాలేజీ అధ్యాపకునిగా నాలుగేళ్లక్రితం రిటైరయ్యాను. నా కొడుకూ, కోడలూ కెనడాలోఉంటారు. నేనూ, శ్రీమతి ఇక్కడ హైదరాబాదులో మారేడ్పల్లిలో ఉంటాం. ఇక, డాక్టరుగా రఘుపతి బాగా సంపాయించాడు. ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నా, కూతురూ, అల్లుడూ ఇక్కడే ఉంటారు. వాడూ నేనూ నెలకోసారైనా కలుస్తూ ఉంటాం. వాడు మా యింటికి వస్తే అదో ప్రత్యేకమైన సందర్బం. వస్తూ వస్తూ వాడు ఖరీదైన విదేశీ మద్యం సీసా తెస్తాడు. మా ఆవిడవేసే ఉల్లిపకోడీలు తింటూ ఏవేవో మాట్లాడుకుంటూ గడిపేస్తాం. |