జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ములేదురాజంకు గొంకు లేక సాగిపొమ్మురా…అని పాడుకుంటూ పన్నెండు గంటలు నిర్విరామంగా ఆఫీసులో పని చేసి, వంచిన నడుము ఎత్తకుండా కష్టపడి , బస్సులలో నిలబడి రాలేక... లోను తీసుకుని కొనుక్కున్న బైకు ఉన్నా కూడా... ఈ వెధవ ట్రాఫిక్కులో ఇరుక్కుని( నా పావు జీవితం రోడ్లపైనే గడిపేస్తూ) ముక్కుతూ మూల్గుతూ బాస్‍ని, ప్రభుత్వాన్ని, నా పెళ్ళాన్ని, పోలీసును, కనపడ్డవాళ్ళందరినీ తిట్టుకుంటూ, ఈసురోమంటు ఇంటికి చేరుకున్నాను. బట్టలు మార్చుకుని , మొహం కడుక్కుని శ్రీమతి ఇచ్చిన కాఫీ తాగి కుర్చీలో కూలబడ్డా. ఏం బ్రతుకురా ఇది. వెధవ మగ జన్మ. ఆ దేవుడు మగవాడై ఉండి మాకు ఇన్ని కష్టాలా? ఇంత కూడా సింపతీ లేదా? పుట్టినప్పటినుండి ఇదే డైలాగ్ " వాడికేంటి మగాడు" అంటారు అందరు. చిన్నప్పటినుండే బ్రెయిన్ వాషింగు మొదలవుతుంది. " ఒరేయ్! ఈ ఇంటిని నువ్వే చూసుకోవాలి. అక్కా, చెల్లెళ్ల పెళ్ళీ పేరంటాలు, అమ్మానాన్నను బాగా చూసుకోవాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి" అని బాగా ప్రిపేర్ చేస్తారు అందరూ కలిసి. భవిష్యత్తులో ఇవన్నీచేయాలని చిన్నప్పటినుండే బాగా బ్యాటరీ చార్జ్ చేస్తారు. ఆడపిల్లలకంటే ఎక్కువ స్వాతంత్ర్యం, డబ్బులు ఇస్తారు. కాని మార్కులు తగ్గితే మాత్రం వీపు విమానం మోతేనంటారు. ఇదే మాటలు అమ్మాయిలకెందుకు చెప్పరు. వాళ్లనేమో హాయిగా సుకుమారంగా పెంచుతారు. స్కూలుకొచ్చి ఏడో క్లాసు దాటగానే IIT, EAMCET అని వాళ్ళే నిర్ణయించేసి బందిలదొడ్డిలోకి పశువులను తోలినట్టు మమ్మల్ని తోలేస్తారు. అఫ్‌కోర్స్ అమ్మాయిలు కూడా మాతో పాటు ప్రతీ దానికి సై అంటు వచ్చేస్తున్నారులెండి. కాని వాళ్లు కంపల్సరీగా చదివి ఉద్యోగాలు చేయాలన్న కండిషన్ ఏమీ లేదు. ఇష్టంలేకుంటే హాయిగా ఇంట్లో కూర్చుంటారు. మగాళ్ళు మాత్రం చచ్చినట్టు ఉద్యోగం చేయాల్సిందే. ఇంట్లో వారి కోరికలు అవసరాలు తీర్చడానికి. పైగా "ఉద్యోగం పురుష లక్షణం" అంటారు. పొగుడుతున్నారా,ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నారా?... అనేది మెల్లగా అర్థమవుతుంది. మొత్తమ్మీద పెళ్ళి అనే బంధిఖానా తప్పదు. ఒకవేళ పెళ్లి "వద్దు" అంటే చదువైపోయింది, ఉద్యోగం వచ్చింది. ఇంకా ఏం వెలగబెట్టేది ఉంది అని మెడకు పెళ్లాం అనే గుదిబండను కట్టేస్తారు. అంతే... ఇక జీవితాంతం మరో ఆడదాని వంక కన్నెత్తి కూడా చూడకూడదు. అందాన్ని చూడడం, ఆనందించడం తప్పా?? ప్చ్.. |