వారమంతా చచ్చే చాకిరి చేస్తామా !. ఆదివారం కాస్త విశ్రాంతిగా ఉందామంటే అదేదో సినిమా చూసి ఆదివారం ఆడవాళ్లకు సెలవు అని మొదలెట్టారు. అటువంటి సినిమాలను తీసే ప్రొడ్యూసర్ , డైరెక్టర్లను అనుకోవాలి. ఇలాంటి సినిమాలు తీస్తున్నందుకు. పూర్వంలోలాగా పనిమనిషి లేకుండా ఏ ఇల్లాలు ఉంటోంది? రోట్లో పిండి రుబ్బుతున్నారా. బట్టలు ఉతుకుతున్నారా...? అన్నింటికి ఆటోమేటిక్ మెషిన్లు ఉన్నాయిగా. అంత సోమరుల్లా తయారయ్యారు ఆడాళ్ళు. అందరూ ఆడాళ్ళనే అయ్యో పాపం అంటారు. ఏం. మగాళ్లకి కష్టాలుండవా? వాళ్ళని అయ్యో అనరే? ఆఫీసులో పని ఎక్కువగా ఉండి రాత్రి ఆలస్యంగా వస్తే అయ్యో పాపం వాళ్ళాయన ఎప్పుడూ ఆలస్యంగానే వస్తాడు. ఆమె ఇంట్లో ఒక్కతే ఉంటుంది. ఎంత కష్టమొచ్చింది. అంటారు గాని, ఆ మొగుడిని మాత్రం అయ్యో పాపం,. ఎంత కష్టపడుతున్నాడు తన భార్యను సుఖపెట్టడానికి అనరు కదా. ఏం సంపాదించేదంతా నాకోసమేనా?...అని అంటే... ఏం మాట్లాడుతున్నారంటారు.
కానీ పెళ్ళిలో పది నిమిషాలు బుట్టలో కూర్చుని వచ్చే ఆడవాళ్ళు జీవితాంతం మొగుడిని బుట్టలో పడేసి ఉంచుతారు. ఐనా తప్పదు. ఆ దేవుళ్లకే తప్పలేదు ఈ తిప్పలు. లక్ష్మీదేవి మహావిష్ణువు కాళ్ల దగ్గర ఎందుకు కూర్చుంది. ఆయన చేసే పనులన్నీ గమనించడానికే. పార్వతీ దేవి శంకరుని సగభాగం ఆక్రమించేసి తను చెప్పినట్టు ఆనంద తాండవమాడిస్తుంది. ఇక సరస్వతి దేవి తక్కువ తిందా బ్రహ్మగారి నాలుక మీద కూర్చుండి తను చెప్పినట్టు మాట్లాడిస్తూ ఉంది. వాళ్ల కష్టాల ముందు నేనెంత వాణ్ణి. తనివితీరా ఏడుద్దామన్నా అదృష్టం లేదు. ఏమంటే ఆడంగి వెధవలా ఏడుస్తున్నాడంటారు. పైగా ఏడ్చే మగవాణ్ణి నమ్మకూడదంట. ఎవరా అన్నది? వాణ్ణి తీసికెళ్ళి హుస్సేన్‌సాగర్‍లో వినాయకుడితో పాటు ముంచేయాలి. నాకు తెలీకడుగుతా పెళ్ళిరోజు, పుట్టినరోజులు గుర్తుంచుకోరని ఎప్పుడు మగాళ్ళ మీద ఆడిపోసుకుంటారు. ఆఫీసులో మా బాస్‌గాడు ఎంత చంఢాలమైన వాడో వాళ్ళకు తెలుసా? హాయిగా ఏసిలో కూర్చుని కంప్యూటర్‌లో టిక్కు టిక్కు మంటు ఉంటామని కుళ్ళుకుంటారు. ఎప్పుడు మగాళ్లే బహుమతులు ఇవ్వాలా? పెళ్ళాలు ఇస్తే ఏం మునిగిపోతుంది. ఇంటి ఖర్చులకోసం ఇచ్చిన డబ్బులుంటాయి (మనవే కదా) అందులోంచి కనీసం జలుబు చేసినప్పుడు ముక్కు తుడుచుకోడానికి నాలుగు రుమాళ్ళు కొంటారా? లేదు. ఖర్మ . ఏం చేస్తాం? ఆ శ్రీకృష్ణుడికే తప్పలేదు ఈ (పెళ్ళాల) తిప్పలు. సత్యభామతో తన్నులు కూడా తిన్నాడు పాపం. ఒక్క పెళ్ళాంతోనే చస్తున్నాం. ఎనిమిది మంది పెళ్ళాలను ఎలా మెయింటేన్ చేశాడో ఆ మహానుభావుడు. పద్మ అవార్డులు, చక్ర అవార్డులన్నీ కలిపి ఆయనకే ఇచ్చేయాలి. ఇంకో విషయం …. చిన్నప్పుడు బయటకు వెళుతుంటే అమ్మఅడుగుతుంది.. ఎక్కడికెళుతున్నావు అని… పెళ్ళయ్యాక పెళ్లాం అడుగుతుంది .. ఎక్కడికెళుతున్నావు అని... చచ్చాక అందరూ అడుగుతారు నాకు తెలుసు... .. ఎక్కడికెళుతున్నావు. అని. నా ఇన్సూరెన్స్ డబ్బంతా నా పెళ్ళానికే ఇచ్చాగా, ఇంకా నేనెక్కడికెళితే ఏంటంట? ఇప్పుడు కూడా నన్ను వదలరా? ఇంతకీ నేను చెప్పొచ్చేదేంటంటే… కష్టాలు ఆడాళ్ళకే కాదు .. మగాళ్ళకీ ఉన్నాయి అని. ఊరుకుంటుంటే భార్యల ఆగడాలు శృతి మించుతున్నాయి. కాబట్టి అందరం ఏకమై సంఘం పెట్టుకుని , ఏం చేయాలని డిసైడ్ చేసుకోవాలి. లేకపోతే ఈ ఆడాళ్ళు మగాళ్లని నూనే లేకుండానే వేపుకు తింటారు …. ఇక సంఘం అంటారా... దానివల్ల పేద్దగా ఒరిగేదేమీలేదు. ఒకరి కష్టాలు ఒకరు చెప్పుకుంటే కాస్త మనశ్శాంతి. ఆడవాళ్ళకే బాధిత సంఘాలు, మహిళామండలి సమితిలు ఉండాలా? భర్తలు పెట్టుకుంటామంటే అదోలా చూస్తారేంటి. జంధ్యాల సినిమాలో బ్రహ్మానందంలా? మా గోడు వినేది ఎవరూ??? |