ఇంట్లోని పిన్ను దగ్గర నుంటి ఫ్రిజ్ వరకు ఏ వస్తువు తీసుకున్నా క్వాలిటీలో ఏ మాత్రం లోపం కన్పించదు. అలాంటి నాన్నగారు నా కోసం కొన్న వస్తువు.. ఇంకొద్దిసేపట్లో నా గదిలోకి రాబోయే ఆ వస్తువు.. చూడ్డానికి మాత్రం ఎంతో అందంగా వున్నా.. క్వాలిటీ శూన్యం..!
నాన్నగారికి నచ్చింది.. మరీమరీ నచ్చింది... అందరూ ఎంతో మెచ్చారు కూడా...అయినా నాకు నచ్చలేదు. "చూడమ్మా! నీకు నచ్చని వస్తువుతో ఎప్పుడూ సర్దుకోవద్దు... కొంచెం రేటెక్కువైనా సరే నచ్చిన మంచి వస్తువే కొనుక్కో... కొన్న తర్వాత క్వాలిటీ బాగాలేదని తెలిస్తే.. కొనేశాం కదా అని పొరపాట్న కూడా అదే వస్తువు వుంచేసుకోవద్దు.. తిరిగి ఇచ్చేసి అలాంటిదే మంచి క్వాలిటీ వుండేది తెచ్చుకో.." అని పదే పదే చెప్పే నాన్నగారితో నాన్నా.. నువ్వు నా కోసం కొన్న ఆ వస్తువు నాకొద్దు.. మార్చుకుంటానంటే వీలుపడుతుందా...? పోనీ నాకు నచ్చలేదు కనుక ఆ వస్తువు నాకు నచ్చలేదని ఖచ్చితంగా చెప్పేస్తే..?
అంత డబ్బు పోసి కొన్న నాన్నగారేమంటారో... నాన్నగారేమంటారో తెలియదుగానీ సమాజం మాత్రం నన్ను హర్షించదు. ఈ సమాజం హర్షించదని నేను సర్దుకుపోవాలా..? వినియోగదారులెప్పుడూ చాలా అప్రమత్తంగా వుండాలని అందరికీ చెప్పే నాన్నగారు ఇలాంటి 'పనికిరాని' వస్తువునెలా కొన్నారు?
చూడడానికి ఎంతో అందంగా వున్నా అది 'పనికిరాని' వస్తువని నాకు మాత్రమే తెలుసు. నేను భయంకరంగా మోసగించబడ్డాననీ తెలుసు. కానీ ఎవరితో చెప్పుకోవాలో తెలియదు.
పోనీ ఆ వస్తువు మార్పు కోసం వినియోగదారుల ఫోరం కెళ్తే..! అసలీతరహా మోసం వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తుందా...? వినిమయదారుల దగ్గర నుంచి వినియోగదారులు కొన్నప్రతి వస్తువు తాలూకు లావాదేవీలన్నీ వినియోగదారుల ఫోరం పరిధిలోకి రావాలి కదా?
ఆ వస్తువు అమ్మకం కొనిగోలు వినియోగదారుల ఫోరం పరిధిలోకి వస్తుందో రాదో గానీ... రెండ్రోజుల క్రితం లక్షలుపోసి కొన్న ఆ 'పనికిరాని' వస్తువు మాత్రం ఇంకొద్దిసేపట్లో నా గదిలోకొచ్చి తీరుతుంది. అన్నట్టు.. ఇంతకీ ఆ వస్తువేంటో చెప్పనేలేదు కదూ...? చూడముచ్చటగొలిపే అందంతో... అతి భయంకరమైన శాడిజాన్ని నరనరాన జీర్ణించుకొని పదుగురి ముందు ఎంతో అమాయకంగా నవ్వుతూ తిరిగే పెద్ద ఆఫీసరుగారైన నా భర్తే ఆ వస్తువు! ఆశ్యర్యంగా వుందా..?
అతడు భర్తగానే కాదు మగాడిగా కూడా 'పనికిరాని' వాడని.. ఐ మీన్ సంసారయోగ్యంకాని వాడని నాకు ఖచ్చితంగా తెలిసినా న్యాయం కోసం ఏ ఫోరం కెళ్ళి చెప్పుకోవాలో తెలియని స్థితి నాది. ఏంటో. నా పరిస్థితికి మీరు జాలిపడకుండా...నాకు జరిగిన ఈ భయంకర మోసాన్ని నేనెవరితో చెప్పుకోవాలో- న్యాయం కోసం ఏ ఫోరంకెళ్ళాలో మీరైనా సలహా ఇవ్వండి... ప్లీజ్... |