ప్రధాన పేజి   ఇతరాలు  ఎన్.ఆర్.ఐ.  ఎన్.ఆర్.ఐ. మహిళలు
 
కత్రినా బాధితులకు అమెరికా తెలుగు సంఘాల వితరణ
అమెరికాను ఇటీవల అతలాకుతలం చేసిన హరికేన్‌ కత్రినా బాధితుల సహాయార్థం అక్కడి తెలుగు సంఘాలు 25వేల డాలర్లను పోగుచేశాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 18వేల డాలర్లు సేకరించగా, డల్లాస్‌ లోని ఉత్తర టెక్సాస్‌ తెలుగు సంఘం(టాన్‌టెక్స్‌) ఏడు వేల డాలర్లు సేకరించింది. తమ యువ సభ్యులుమౌన, ధ్యాన యలమంచిల నృత్య ప్రదర్శన ద్వారా టాన్‌టెక్స్‌ నిధుల సేకరణ జరిపింది. నాట్యాంజలి నృత్య పాఠశాలకు చెందిన శ్రిలతా సూరి ఈ కూచిపూడి నృత్య ప్రదర్శనను సమకూర్చారు.

ఈ మొత్తాన్ని అమెరికా కాంగ్రెస్‌ సభ్యుడు బాబీ జిందాల్‌ను డిసెంబర్‌ 23న కలిసి 25వేల డాలర్ల విలువ చేసే చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఆయనతో సమావేశమైన వారిలో తానా సంఘ గౌరవ ఉపాధ్యక్షుడు ప్రభాకర్‌ చౌదరి కాకరాల, కోశాధికారి ప్రసాద్‌ తోటకూర, నైరుతి ప్రాంత ఉపాధ్యక్షుడు రాం యలమంచిలి, నృత్య ప్రదర్శన జరిపిన టాన్‌టెక్స్‌ యువసభ్యులు మౌన, ధ్యాన యలమంచిలు, వారి తల్లిదండ్రులు ఉమా, శ్రినివాస్‌లు, లూసియానా స్థానిక నేతలు ఉన్నారు.

ఈ సందర్భంగా ప్రభాకర్‌ చౌదరి మాట్లాడుతూ తుపాను కారణంగా యావత్‌ సమాజం దారుణంగా దెబ్బతినడం శోచనీయమన్నారు. ఇటువంటి విపత్కర సమయాల్లో సహ మానవాళిని ఆదుకునే విషయంలో తానా ఎల్లపుడూ ముందుంటుందన్నారు. అందుకే కత్రినా బాధితులకోసం తమ సభ్యులు ముందుకొచ్చి భారీ మొత్తంలో వితరణ అందించారని చెప్పారు.

వారి నుంచి సాయాన్ని స్వీకరించిన బాబీ జిందాల్‌ ధన్యవాదాలు తెలిపారు. మాతృదేశంలోనే కాక ఆశ్రయమిచ్చిన దేశంలోనూ సాయపడేందుకు తానా సిద్దంగా ఉంటుందన్న విషయం మరోసారి స్పష్టమైందని ఈ సందర్భంగా ఆయన కితాబిచ్చారు. విరాళాల సేకరణకై నృత్య ప్రదర్శన ఇచ్చిన యలమంచి సిస్టర్స్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కత్రినా బాధితులను ఆదుకునేందుకు దేశం నలుమూలల నుంచి ప్రజలు ఇతోధికంగా సాయపడుత్నునారన్నారు.

గరిష్టంగా 250 వేల డాలర్లు అందుకున్న తాను 8 డాలర్లను తీసుకునేందుకు కూడా సంశయించలేదన్నారు. ప్రతి చిన్న మొత్తాన్ని కూడా ఏదో రీతిలో బాధితులకు సాయపడేందుకు వినియోగిస్తామని చెప్పారు. తమ సంస్కృతి, సాంప్రదాయ విలువలను కొనసాగిస్తూనే తానా సభ్యులు అమెరికా జనజీవన ప్రవంతిలో మమేకయ్యారని ప్రసాద్‌ తోటకూర తెలిపారు. ఉత్తర అమెరికాలో ఘన చరిత్ర కలిగిన సంస్థల్లో ఒకటిగా ఉన్న తానా ఆంధ్రలో పలు మానవతా సాయ ప్రాజెక్టులకు తానా ఫౌండేషన్‌ ద్వారా మిలియన్‌ డాలర్లు వెచ్చిస్తోందన్నారు. అలాగే అమెరికాలోని పేద పిల్లల కోసం కూడా తాము సాయం చేస్తున్నామని చెప్పారు.