ప్రవాస భారతీయురాలిగా తొలుత మహిళలకు గర్వకారణంగా నిలిచి అటు పిమ్మట భారత జాతి యావత్తూ గర్వించే నారీ శిరోమణిగా వ్యోమగామిగా రికార్డు సృష్టించిన సునీతా విలియమ్స్ వేనోళ్ళ ప్రశంసలను అందుకుంటున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో భారత్‌లో పర్యటించిన సందర్భంగా తన తదుపరి లక్ష్యం చందమామను చేరుకోవడమని భారత విద్యార్థులకు ఆమె తెలిపారు. అంతేకాక వ్యోమగామిగా తాను సాధించిన రికార్డులను తలదన్నేలా ఎదగమని భావి భారత పౌరులకు పిలుపునిచ్చిన సునీతా విలియమ్స్ గురించి తెలుసుకుందాం.
అమెరికా దేశంలోని ఓహియోలోని యుక్లిడ్‌లో 1965, సెప్టెంబర్ 19న జన్మించిన సునీతా విలియమ్స్, మస్సాచుసెట్స్‌లో స్థిరపడ్డారు. మైకేల్ జే. విలియమ్స్‌ను వివాహమాడిన సునీతకు రన్నింగ్, స్విమ్మింగ్, బైకింగ్, విండ్‌సర్ఫింగ్, స్నోబోర్డింగ్ మరియు బో హంటింగ్ అంటే ఎనలేని ఆసక్తి. ఆమె తల్లిదండ్రులైన డాక్టర్ దీపక్ మరియు బోన్నీ పాండ్యాలు మస్సాచుసెట్స్‌లోని ఫల్‌మౌత్‌లో నివసిస్తున్నారు.
సునీత తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని 1983 సంవత్సరంలో మస్సాచుసెట్స, నేథమ్‌లో గల నేథమ్ హైస్కూల్‌లో పూర్తి చేశారు. అనంతరం 1987లో యూఎస్. నావల్ ఎకాడమి నుంచి భౌతిక శాస్త్రంలో బి.ఎస్. పట్టాను అలాగే 1995లో ఫోర్లిడా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్‌లో ఎమ్.ఎస్. పట్టాను పుచ్చుకున్నారు.
|