పురుషుల మతులు పోగొట్టే ప్రపంచ రాజకీయ మహిళల జాబితాలో మూడో స్థానంలో నిలిచిన భారత సంతతికి చెందిన కెనడా సిక్కు ఎంపీ రూబీ ధల్లా మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఇంట్లో పనిచేసే ఇద్దరు పనిమనుషులపై ఆమె వేధింపులకు పాల్పడినట్లు తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.రూబీ తల్లికి సంరక్షకులుగా సేవలు అందించి గోర్డో (31), టంగ్‌సన్ (37) అనే మహిళలు... రూబీ, ఆమె కుటుంబ సభ్యులు తమను వేధింపులకు గురి చేసినట్లు బహిరంగంగా ఆరోపించారు. తమ పాస్‌పోర్టులను లాక్కోవడమే గాకుండా, తమ చేత రోజుకి 16 గంటలపాటు గొడ్డు చాకిరీ చేయించుకునేవారని ఆ మహిళలు వాపోయారు.దీంతో... కార్మిక, వలస చట్టాల ఉల్లంఘనకు పాల్పడిన రూబీని విచారించాలంటూ పలు ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలంటూ రూబీ ధల్లా తోసిపుచ్చారు. తమ వద్ద పనిచేసిన ఆ మహిళలను తాము ఎలాంటి ఇబ్బందులకూ గురిచేయలేదని ఆమె పేర్కొన్నారు.ఇదిలా ఉంటే... కెనడాలో ప్రవాస భారతీయులు అత్యధికంగా ఉన్న బ్రాంప్టన్-స్ప్రింగ్‌డేల్ నియోజక వర్గం నుంచి మూడుసార్లు ఎంపీగా రూబీ ధల్లా ఎన్నికయ్యారు. 35 సంవత్సరాల ఈ మాజీ మిస్ ఇండియా-కెనడా రన్నరప్ ఓ బాలీవుడ్ చిత్రంల అసభ్యంగా నటించారన్న ఆరోపణతో గతంలో పలు వివాదాలను ఎదుర్కొన్నారు. |