వివాదాస్పద భారత సంతతి సిక్కు ఎంపీ రూబీ ధల్లా (35)కు వ్యతిరేకంగా ఎలాంటి రాజకీయ కుట్ర జరగలేదని.. కెనడా ఇమ్మిగ్రేషన్ మంత్రి జాన్సన్ కెన్నడీ స్పష్టం చేశారు. కాగా.. రూబీ ధల్లా, ఆమె కుటుంబ సభ్యులు తమను వేధింపులకు గురిచేశారంటూ.. ఆమె ఇంట్లో పనిచేసిన ముగ్గురు మహిళలు బహిరంగంగా ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ధల్లా రాజకీయ జీవితంపై దుమారం చెలరేగింది. పలు ప్రజా సంఘాలు ధల్లాను విచారించాలంటూ డిమాండ్ చేశాయి. ధల్లా రాజకీయ జీవితాన్ని నాశనం చేసేందుకు, ఆమె ప్రత్యర్థులు రాజకీయంగా కుట్ర పన్నారంటూ ఆమె తరపు న్యాయవాది ఆరోపించారు.
అయితే, ఈ ఆరోపణలను నిర్దద్వంద్వంగా త్రోసిపుచ్చిన జాన్సన్ కెన్నడీ... ఇందులో కుట్ర చేయడానికేమీ లేదని స్పష్టం చేశారు. అయినా అధికార కన్జర్వేటివ్ పార్టీకి ధల్లాతో ఎలాంటి విభేదాలు లేవని, అలాంటప్పుడు కుట్ర చేయాల్సిన అవసరం ఎవరికుందని ఆయన ప్రశ్నించారు.
ఇదిలా ఉంటే... పంజాబీలు అధిక సంఖ్యలో నివసిస్తున్న బ్రాంప్టన్-స్ర్పింగ్‌డేల్ నియోజక వర్గానికి 2004 నుంచి ప్రతిపక్ష లిబరల్ పార్టీ తరపున రూబీ ధల్లా ఎంపీగా పనిచేస్తున్నారు. కాగా... పురుషుల మతులు పోగొట్టే ప్రపంచ రాజకీయ మహిళల జాబితాలో రూబీ మూడో స్థానంలో నిలిచిన సంగతి విదితమే. |