కెనడాకు చెందిన ప్రఖ్యాత చిన్న కథల రచయిత్రి ఎలిస్ మన్రో (77)కు ఈ ఏడాది "మ్యాన్ బుకర్ అంతర్జాతీయ పురస్కారం" లభించింది. బెంగాలీ రచయిత్రి మహాశ్వేతాదేవి, నోబెల్ బహుమతి గ్రహీత, భారత సంతతి రచయిత వి.ఎస్. నైపాల్‌లతో కూడిన న్యాయ నిర్ణేతల బృందం మన్రోను విజేతగా ఎంపిక చేసింది.2005 వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన ఈ అవార్డు అందుకున్న వారిలో మన్రో మూడో వ్యక్తి కాగా... ఈ అవార్డు కింద ఆమెకు రూ.45 లక్షల (60 వేల పౌండ్లు) నగదు బహుమతి అందజేస్తారు. జీవించి ఉండి తన రచనల ద్వారా సాహిత్యాన్ని పరిపుష్టం చేసే రచయితలకు ఈ అవార్డును అందజేస్తారు. ఈ సందర్భంగా న్యాయ నిర్ణేతలు మాట్లాడుతూ... మన్రో కథల్లో లోతైన ఆలోచన, క్లుప్తత ఉన్నాయని ప్రశంసించారు. ఎలిస్ మన్రో కథలు చదవడమంటే, గతంలో ఎన్నడూ ఆలోచించలేని విధానాన్ని తెలుసుకోవడమేనని వారు ఆమెను కొనియాడారు. ప్రస్తుతం ఒంటారియోలో నివసిస్తున్న మన్రో... బుకర్ అవార్డు దక్కడంపట్ల సంతోషం వ్యక్తం చేశారు.ఇదిలా ఉంటే... మన్రో కథలు తరచుగా "ద న్యూయార్కర్", "ద అట్లాంటిక్ మంత్రీ", "గ్రాండ్ స్ట్రీట్", "మేడ్‌మోయిసెల్", "ద పారీస్ రివ్యూ"లలో ప్రచురితమయ్యాయి. ఆమె రాసిన మొదటి పుస్తకం "డాన్స్ ఆఫ్ ది హ్యాపీ షేడ్స్" ఉత్తమ రచనగా పేరు పొందింది. దీనికి కెనడా అత్యంత ప్రతిష్టాత్మకమైన గవర్నర్ జనరల్ సాహిత్య అవార్డు లభించింది. |